పామిడి: వంకరాజుకాలువ గ్రామ పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతుండటంపై గ్రామస్తులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. నది పరీవాహక ప్రాంతం సమీపంలో 150 మంది రైతులు 400 ఎకరాల మాగాణిలో వరి సాగుచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు, తాగడానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఇలాగే ఉంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి మంగళవారం ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా తవ్వకాలు చేపడతారంటూ ప్రశ్నించారు. ఇంతలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి గ్రామ టీడీపీ నాయకులకు ఫోన్ వచ్చింది. సిక్స్‌వే నిర్మాణంలో భాగంగా గుడ్డాలపల్లి వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణం కోసం ఇసుక తరలిస్తున్నట్లు తెలపగా.. సాగు–తాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశమున్నందున తవ్వకాలకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. గత్యంతరం లేక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఇసుక రవాణాదారులు హిటా చీ, టిప్పర్లను పెన్నానది నుంచి తీసుకెళ్లిపోయారు.


