నార్పల: మామపై దాడికి పాల్పడిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నార్పల ఎస్‌ఐ జి.సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా తాతిరెడ్డి పల్లికి చెందిన చరణ్‌కు నార్పల గ్రామానికి చెందిన రమాదేవితో 18 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన భార్యను చూసేందుకు గత నెల 31న చరణ్ తన తండ్రి శివకుమార్, బంధువు శివకల్యాణ్‌తో కలిసి నార్పల వచ్చాడు. తన భార్య, పిల్లలను పంపాలని కోరగా, ఇప్పుడు పంపలేమని అత్తామామాలు చెప్పారు. ఆ మాటలకు ఆగ్రహం చెందిన చరణ్ వెంట తెచ్చుకున్న కొడవలితో మామ చిలమకూరి రాజా మెడపై దాడి చేయబోయాడు. గమనించిన రాజా తన చేతిని అడ్డుపెట్టడంతో తీవ్ర గాయమైంది. మిగిలిన ఇద్దరు కూడా రాజాపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిలమకూరి రాజా కుమార్తె రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నాయనపల్లి క్రాస్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కొడవలిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.


