వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడం, చీనీ తోటలు వాడుముఖం పట్టడం, తెగుళ్లతో కాయలు దెబ్బతినడం వెరసి చీనీ రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్‌లో చీనీ ధరలు భారీగా పడిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది.
చీనీ తోటలో తెగుళ్ల నివారణకు పురుగుల మందులు పిచికారీ చేయాలంటే ధరలు పెరిగిపోయాయి. మార్కెట్‌లో చీనీ ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు ఉంటే అప్పు చేసి తెచ్చయినా మందులు పిచికారీ చేసేవాడిని. దిగుబడి వచ్చిన తరువాత చెల్లించేవాడిని. అయితే, కాయలు కొనుగోలు చేయడానికి వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో దిక్కుతోచడం లేదు.
– థామస్‌రెడ్డి, రైతు, తాడిపత్రి
తాడిపత్రి రూరల్: జిల్లాలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయి. యల్లనూరు, పుట్లూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, గార్లదిన్నె, నార్పల, కళ్యాణదర్గం తదితర మండలాల్లో భారీగా చీనీ పంట సాగవుతోంది. తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల హెచ్చుతగ్గులు, మారిన వ్యవసాయ పరిస్థితులు, అడుగంటుతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో ఇటీవల కొంతమంది రైతులు తోటల్లోని చీనీ చెట్లను కొట్టివేస్తున్నారు. వాటి స్థానంలో అరటి, దానిమ్మ, బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
ఫలితం ఏదీ..?
చీనీ తోటలకు ఇటీవల బోరాన్, ఎండుతెగులు, తెల్లదోమ ఆశించడంతో పంట దిగుబడి తగ్గుతోంది. బోరాన్ లోపం వల్ల కాయలు పగులుతున్నాయి. గట్టిగా మారి రసం తగ్గిపోతోంది. ఎండు తెగులు కారణంగా చెట్లు ఎండిపోతున్నాయి. తోటలకు తెల్లదోమ పోటు ఎక్కువగా ఉంది. కాయలు, ఆకులపై తెల్లగా పిండి చల్లినట్టుగా కనిపిస్తోంది. దీన్ని రైతులు పిండినల్లిగా కూడా పిలుస్తారు. కాయలు మచ్చలుగా ఏర్పడి రంగు మారుతుండడంతో డిమాండ్ ఉండదు. తెగుళ్ల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
పడిపోయిన ధర
అరకొర దిగుబడి వచ్చినా ఎలాగోలా అప్పులు తీర్చుకుందామని ఆశించిన రైతులను తగ్గిన చీనీ ధరలు మరింత ఆవేదనలోకి నెడుతున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం చీనీ టన్ను రూ.14 వేలు పలుకుతోంది. ధర తగ్గినా విక్రయించేందుకు రైతులు ముందుకొచ్చారు. అయితే, వ్యాపారులు చీనీ పంటను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం లేదు. గతంలో తోటల వద్దకే వచ్చి కాయలను కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మరిన్ని రోజులు చెట్లపైనే కాయలు ఉంచితే పాడవుతాయన్న భయాందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్‌కు తీసుకెళ్లడానికి కూలి, వాహన ఖర్చులకు సరిపోతుందన్న భయంతో చెట్లపైనే కాయలు ఉంచి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నారు.
పంటకు తెగుళ్లతో సతమతం
ఎన్ని మందులు కొట్టినా అదుపులోకి రాని వైనం
మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో మరింత ఆవేదన


