టీడీపీ నాయకుల అరాచకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల అరాచకం

Sep 10 2026 12:51 AM | Updated on Sep 10 2026 12:51 AM

పెద్దవడుగూరు : మండలంలో టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తాళం వేశారు. దాన్ని తీయడానికి బుధవారం ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు ఏకపక్షంగా అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎద్దుల సూర్యప్రభాకర్‌రెడ్డి పెద్దవడుగూరులో పార్టీ కార్యాలయ నిర్వహణకు పి.కొట్టాలపల్లికి చెందిన శిరారెడ్డి భవనాన్ని బాడుగకు తీసుకున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పోలీసులకు తెలిపారు. వారు చెప్పిందే వేదంగా పోలీసులు భవన యజమానిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఆయన స్టేషన్‌కు వెళ్లారు. తాను భవనాన్ని బాడుగకు ఇచ్చానని స్పష్టం చేశారు. అయినా పోలీసులు వారం రోజుల పాటు కార్యాలయం తెరవడానికి వీల్లేదని సూచించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసుల సూచనలు పాటించి వారం పాటు కార్యాలయ తలుపులు తీయలేదు. పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కార్యాలయ తలుపు తీశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బయటకు పంపి దౌర్జన్యంగా తాళం వేసుకుని వెళ్లారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు సూర్యప్రభాకర్‌రెడ్డి, భవన యజమాని కలసి పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు స్పందించలేదు.

పోలీసుల ఏకపక్ష వైఖరి

పోలీసుల ఏకపక్ష ధోరణితో విసిగిపోయిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎద్దుల శరభారెడ్డి, నాయకులు బుధవారం కార్యకర్తలతో కలసి కార్యాలయ తాళం తీయడానికి ప్రయత్నించారు. అయితే ఎస్‌ఐ రాఘవేంద్రప్ప, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుతో విసిగి పోయిన మండల కన్వీనర్‌ ఎద్దుల శరభారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. గమనించిన ఎస్‌ఐ వారించారు. సీఐ నరేంద్రరెడ్డి సిబ్బందితో చేరుకుని ఘటనపై ఆరా తీశారు. చివరకు భవన యజమాని ఎలా చెబితే అలా చేస్తామనడంతో ఆయన్ను అక్కడికి పిలిపించారు. తాను వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి ఇష్ట పూర్వకంగానే భవనం ఇచ్చానని యజమాని స్పష్టం చేశారు. అయినా పోలీసులు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయ తాళం తీసి లోపలికి వెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు దాడికి సిద్ధమై అక్కడికి బయలుదేరారు. దీంతో పోలీసు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

– వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తాళం

– తెరవడానికి ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు

– ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement