మొదటి రోజే ఏడి‘పింఛన్‌’ | - | Sakshi
Sakshi News home page

మొదటి రోజే ఏడి‘పింఛన్‌’

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

ఆత్మకూరు: కొత్త పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా ఆత్మకూరు మండల వ్యాప్తంగా 2 వేల మంది వరకు కొత్త పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం ఆత్మకూరులోనే 500 మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో సచివాలయాల వద్ద సోమవారం వారంతా బారులు తీరారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్‌ పని చేయకపోవడంతో వద్ద నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16 వరకే దరఖాస్తుకు అవకాశం ఉండటంతో అర్హులు ఆందోళనకు గురవుతున్నారు.

కుష్టును నిర్మూలించాలి

అనంతపురం అర్బన్‌: కుష్టువ్యాధిని నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కో–ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. కుష్టు నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారింపజేసుకోవాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఎండీటీ మందులను అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కట్టా వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజు నాయుడు, కుష్టు నివారణ అధికారి జయలక్ష్మి, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌ గంగాధర్‌రెడ్డి, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, పారామెడికల్‌ అధికారి నాగన్న, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అయినవారు ఉన్నా

అనాథలా మృతి!

పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన అశోక్‌ (65) 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్‌ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు.

ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి

ఉరవకొండ: ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం నుంచి సోమవారం ఆటో ప్రయాణికులతో బయలుదేరింది. ఉరవకొండ సమీపంలో గొర్రెల మంద అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన అంజయ్య (70) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ బాషాతో పాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్యకు భార్య తిప్పమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లాకు 36 పతకాలు

అనంతపురం సెంట్రల్‌: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 4 స్వర్ణ, 22 రజత, 10 కాంస్య పతకాలు సాధించారు. సోమవారం ఎస్పీ జగదీష్‌ తన చాంబర్‌లో క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో రాణించడం ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ ఇలియాస్‌ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement