అనంతపురం న్యూ టౌన్: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అదే సమయంలో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవీ కాలం ఈ నెల 24వ తేదీ ముగియనుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక కేంద్రాల్లో ఓటర్ల వివరాలు ఓటింగ్ కేంద్రాలు తదితర ప్రధాన ఎన్నికల అంశాలపై జిల్లా పరిషత్ కార్యలయంలో సంబంధిత అధికారులు వివరాలను నవీకరణ చేస్తున్నారు.
నేడు ఎన్నికల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించనున్నారు. ఈ వీసీ ద్వారా త్వరలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టవలసిన చర్యలపై జిల్లా పరిషత్ సీఈవో, డిడివోలు, ఎంపీడీవోలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా జడ్పీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, డీడీఓ కార్యాలయం నుంచి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు ఎంపీపీ కార్యాలయాల నుంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు విర్చువల్‌గా జరిగే ఎన్నికల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి.
2026 అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 2026 జనవరిలో ప్రచురితమైన ఓటర్ల జాబితా ప్రాతిపదికగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం గానీ లేదా తొలగించడం గానీ జరగదు. మండలస్థాయిలో వాటి ప్రాదేశిక స్థానాన్ని బట్టి ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను కలిపి మండల ప్రాదేశిక స్థానాల సరిహద్దులను గుర్తించనున్నారు. మరో వారం పది రోజుల్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాను ప్రచురించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు ఈ నెల 10వ తేదీలోగా పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాల పరిధిలో 841 ఎంపీటీసీ స్థానాలకు, 63 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


