బెళుగుప్ప: విద్యుత్ సమస్యలపై రైతులు కన్నెర్రజేశారు. శుక్రవారం హనిమిరెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి.. ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు లైన్‌మెన్ కూడా లేరని, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలు లో ఓల్టేజీ సమస్యతో నీరందక ఎండిపోతున్నాయని మండిపడ్డారు. తొమ్మిది గంటలు ఇవ్వాల్సిన విద్యుత్‌ను లోడ్ రిలీఫ్ పేరుతో ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించేంతవరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో అటువైపు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రావడంతో రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
● లోఓల్టేజీ సమస్య తీవ్రరూపం దాల్చడంతో నక్కలపల్లి రైతులు బెళుగుప్ప సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో లో ఓల్టేజీ ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, మోటర్లు ఆడటం లేదని తెలిపారు. దీంతో పంటలకు నీరందించలేని దుస్థితి నెలకొందన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఐదు, ఎనిమిది కలిపి 13 మిలియన్ వాట్స్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని, వీటి స్థానంలో 16 లేదా 20 మిలియన్ వాట్స్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల ఏఈ గంగాధర్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.


