అనంతపురం సెంట్రల్: నగరంలోని అశోక్‌నగర్‌లో సొంత అల్లుడిపై అతని మామ కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిల్లిగుండ్లకాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా తన కుమార్తెను అశోక్‌నగర్‌కు చెందిన బాబ్జాన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. దీనిపై పోలీసులకు బాబ్జాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన మున్నా కొంతమందిని వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం అల్లుడి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన బాబ్జాన్‌ను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.


