రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మఠం భరద్వాజ్ అలియాస్ భరత్ దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న నలుగురు అనుమానితులను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని రహస్య ప్రదేశానికి తరలించి తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
భరద్వాజ్‌కు ఓ వివాహిత మహిళతో సన్నిహిత సంబంధం ఉండటమే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మహిళ భర్తతో పాటు అనంతపురం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, మరో ఇద్దరు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళను సంతానం లేని దంపతులు దత్తత తీసుకున్నట్లు తెలిసింది. వారు ఇటీవల మృతి చెందగా.. తమ ఆస్తిని అప్పటికే విక్రయించినట్లు సమాచారం. అయితే తనకు దత్తత తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉందని సదరు మహిళ పలువురితో చెబుతూ.. న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిసింది.
అనంతపురం కమలానగర్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహించే సదరు మహిళ, ఆమె భర్తకు టిఫిన్ కోసం వెళ్లే క్రమంలో భరద్వాజ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆస్తి వివాదం గురించి వారు భరద్వాజ్‌తో చర్చించినట్లు సమాచారం. తనకు పరిచయాలు ఉన్నాయని, న్యాయపరంగా సమస్యను పరిష్కరించి ఆస్తి ఇప్పిస్తానని అతను చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సదరు మహిళకు, భరద్వాజ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను విజయవాడకు తీసుకెళ్లి కొద్దిరోజులు అక్కడే ఉండగా.. ఆమె భర్త వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సదరు మహిళను హోంకు తరలించగా.. అక్కడికి వెళ్లిన భరద్వాజ్ ఆమెను మళ్లీ తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో భరద్వాజ్ రిమాండ్‌కు వెళ్లి, సుమారు నెల క్రితం బయటకు వచ్చినట్లు సమాచారం.
పిలిపించి.. పక్కా స్కెచ్‌తో?
సదరు మహిళ భర్త సమీప బంధువు వివాహం ఇటీవల జరగడంతో స్థానిక బళ్లారిరోడ్డులోని లలితానగర్ ఆరాధ్య హోమ్స్‌లో భార్యాభర్తలు కొద్దిరోజులుగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భరద్వాజ్ శనివారం రాత్రి అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కొడవళ్లతో నరికి, తలపై రాయితో మోదారు. కుడిచేయిని మోచేయి వరకు తెగిపోయేలా నరికారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న భరద్వాజ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. అతన్ని సదరు మహిళ ఫోన్ చేసి పిలిపించిందా? లేక ముందస్తు ప్రణాళికలో భాగంగానే అక్కడికి రప్పించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి విచారణలో హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఘటన వెనుక ఉన్న వ్యక్తులు బయట పడే అవకాశముంది.
భరద్వాజ్ హత్య కేసు
దర్యాప్తు ముమ్మరం
పోలీసుల అదుపులో నలుగురు?
టిఫిన్ సెంటరులో పరిచయం..
వివాహేతర సంబంధమే కారణమా?


