అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావం వెంటాడుతున్నా... పంట విత్తుకునేందుకు తేమ లేకున్నా... అదను కాకున్నా... సాగు లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఊరూరా నెట్‌వర్క్ ఉన్నా కచ్చితమైన సాగు గణాంకాలు సేకరించడంలో వ్యవసాయశాఖ విఫలమవుతోంది. 31 మంది ఏఓలు, 50 మంది వరకు ఏఈఓలు, 326 మంది ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లతో పాటు అదనంగా పదుల సంఖ్యలో ఎంపీఈఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేశారు, ఇంకా ఎంత చేయాల్సి ఉంది, ప్రత్యామ్నాయం ఎంత అవసరం అవుతుందనే వివరాలు తెలుసుకోవడం సులభమైనా... ఆ పని మాత్రం చేయడం లేదు. వందశాతం కచ్చితమైన సమాచారం లేకున్నా 80 శాతం వాస్తవ లెక్కలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. తద్వారా పంటల బీమా కింద పంటల వారీగా ప్రీమియం కట్టించడం, ప్రత్యామ్నాయం, ఇతరత్ర ప్రయోజనాలు వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయశాఖ వారం వారం విడుదల చేస్తున్న సాగు గణాంకాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎల్–నినో తీవ్రంగా ఉన్న ఈ ఖరీఫ్‌లో కష్టాల్లో ఉన్న తమకు మేలు జరిగేలా చంద్రబాబు సర్కారు, వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జూలైలోనే 1.50 లక్షల హెక్టార్లలో పంటలు
ఈ ఖరీఫ్‌లో జూలై మొదటి వారం ముగిసేనాటికే జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలుస్తోంది. కానీ వ్యవసాయశాఖ మాత్రం 3.43 లక్షల హెక్టార్లకు గాను 16 శాతంతో కేవలం 55 వేల హెక్టార్లు చూపించడం గమనార్హం. ఆ తర్వాత వారం వారం పెంచుకుంటూ వస్తోంది. జూలైలో అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షాలకు కొంత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యవసాయశాఖ మాత్రం జూన్ 30న 40 వేల హెక్టార్లు చూపించి.... క్రమంగా అంటే జూలై 6న 55 వేల హెక్టార్లు, జూలై 13న 82 వేల హెక్టార్లు, జూలై 27న 1.05 లక్షల హెక్టార్లుగా పేర్కొన్నారు. అంటే ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన కంది, వేరుశనగ, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలు విత్తుకునే గడువు జూలై ఆఖరుతో ముగిసింది. ఆగస్టు 3న విడుదల చేసిన నివేదికలో 40 శాతంతో 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా ఈ నెల 10న 1.70 లక్షల హెక్టార్లు, 17న 1.88 లక్షల హెక్టార్లు... తాజాగా విడుదల చేసిన సాగు లెక్కల ప్రకారం 60 శాతంతో 2.08 లక్షల హెక్టార్లకు చేర్చారు. తేలికపాటి వర్షాలకు వాస్తవంగా వారానికి 2 నుంచి 3 వేల హెక్టార్లు పెరిగే అవకాశం ఉన్నా... వారం వ్యవధిలోనే 20 వేల నుంచి 30 వేల హెక్టార్లకు పెంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘ప్రత్యామ్నాయాని’కి కొర్రీలే
సాగు గణాంకాలు 60 శాతానికి చేరుకోవడంతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికకు కొర్రీలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఉలవ, పెసర, అలసంద, కంది, కొర్ర, జొన్న తదితర విత్తనాలు 40 వేల క్వింటాళ్లకు 80 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించినా.. ప్రస్తుతానికి 31 వేల క్వింటాళ్లకు కుదించారు. ఇప్పుడు మళ్లీ ఇందులో సగానికి పైగా కొర్రీలు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉలవ, కొర్రలు 10 వేల నుంచి 12 వేల క్వింటాళ్లు పంపిణీ చేసినా బాగా చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ–క్రాప్ కొనసాగుతున్నందున ఇంకా సాగు లెక్కలు పెరిగే పరిస్థితి ఉన్నందున ‘ప్రత్యామ్నాయం’ మరింత తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.
తాజాగా 2.08 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు
వాస్తవంగా జూలై మొదట్లోనే 1.50 లక్షల హెక్టార్లలో సాగు
కానీ అధికారికంగా చూపించింది 55 వేల హెక్టార్లు మాత్రమే
ఊరూరా నెట్‌వర్క్ ఉన్నా సరైన సాగు లెక్కలు రాని దుస్థితి
ఇప్పుడు ఉలవలు, కొర్రలతో సరిపెడుతున్న ‘ప్రత్యామ్నాయం’


