చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో గుట్టలు కరుగుతున్నాయి.. చెరువులు చెరబడుతున్నారు.. సహజ వనరులు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు మట్టి దందాను సాగిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అనంతపురం రూరల్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో గుట్టలు కరుగుతున్నాయి.. చెరువులు చెరబడుతున్నారు.. సహజ వనరులు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు మట్టి దందాను సాగిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అనంతపురం రూరల్‌

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

నరసనాయనికుంట విబూదిగుట్టలో అక్రమంగా సాగుతున్న మట్టి తవ్వకాలు

రాప్తాడు రూరల్‌: సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ కొందరు అక్రమంగా మట్టి దందా చేస్తున్నారు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

మన్నీల నుంచి చియ్యేడు వరకు..

అనంతపురం రూరల్‌ మండలంలోని మన్నీల, పూలకుంట, కృష్ణంరెడ్డిపల్లి, చియ్యేడు తదితర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి. కృష్ణంరెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి రేయింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టిని అనంతపురం నగరానికి తరలిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మట్టి టిప్పర్లు పోలీసుస్టేషన్‌ ఎదుటి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎస్కేయూ సమీపంలోని ఓ వెంచర్‌ వద్ద పెద్ద ఎత్తున మట్టి డంపులు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి అవసరమైన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.

గుట్టలు తరుగుతున్నా పట్టని వైనం

నరసనాయనికుంట గ్రామ శివారులోని విబూదిగుట్ట నుంచి ఎర్రమట్టిని రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే వేలాది ట్రిప్పుల మట్టి తరలిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. గుట్టలు ఇలా తరిగిపోతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. సమీపంలోని వెంచర్లతో పాటు అనంతపురం నగర శివారులోని వివిధ వెంచర్లకు ఇక్కడి నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్నారు.

అక్రమార్కుల చెరలో హంపాపురం చెరువు

రాప్తాడు మండలం హంపాపురం చెరువు నుంచి బంక మట్టి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు మండి పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామానికి చెందిన ఓ యువ నాయకుడు చెరువు మట్టి దందాను కొనసాగిస్తున్నాడు. ఇటీవల చెరువులోకి కొద్దిపాటి నీరు చేరడంతో తాత్కాలికంగా రవాణా నిలిపివేసి, గ్రామ శివారులోని ఓ గుట్ట నుంచి ఎర్రమట్టిని తరలించారు. చెరువులో నీరు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. గ్రామానికి తూర్పువైపున ఓ ప్రాంతంలో భారీగా మట్టిని డంప్‌ చేస్తున్నారని, జాతీయ రహదారి పక్కన పాత గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున మట్టి నిల్వలు ఏర్పాటు చేసుకుని, రాత్రి వేళల్లో వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలించేస్తున్నారని స్థానికులు తెలిపారు.

పత్రికల్లో వస్తేనే హడావుడి..

అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించడం, నామమాత్రపు కేసులు నమోదు చేయడం లేదా వాహనాలను సీజ్‌ చేయడం, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ యథాతథం కావడం పరిపాటి అయ్యింది. సహజ వనరుల దోపిడీపై రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ, విజిలెన్స్‌, పోలీసు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ అరికట్టడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.

అధికారమే అనుమతిగా సహజ వనరుల దోపిడీ

అడ్డూ అదుపు లేకుండా మట్టి అక్రమ రవాణా

రాప్తాడు నియోజకవర్గంలో యథేచ్ఛగా దందా

ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ అక్రమార్కుల దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement