సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరంలో డబుల్ రిజిస్ట్రేషన్లు, విలువైన ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న ‘పచ్చ’నేతల కన్ను ఇప్పుడు ఆలయాలపై పడింది. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రశాంతతకు మారుపేరు అయిన ఆలయాల్లోనూ రాజకీయ చిచ్చు రాజేస్తున్నారు. తాజాగా సామాజిక, సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనంగా నడుస్తున్న కొత్తూరు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి గుడి(అమ్మవారి శాల)పై ‘పచ్చ’ నేతల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా అధికార జులుం ప్రదర్శించి ..కొత్త కమిటీని ఎంపిక చేసి.. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అమ్మవారి శాలలో జరగాల్సిన కార్యవర్గ ఎన్నికను.. నాలుగు రోజుల కిందట ఆర్యవైశ్య హాస్టల్‌లో రాత్రి పూట పొద్దుపోయాక కమిటీని ప్రకటించేశారు. ఆర్యవైశ్య హాస్టల్‌లో విద్యార్థులు, హాస్టల్ భవనంపైన వృద్ధులు బస చేస్తున్నారు. అలాంటి చోట భయానక వాతావరణంలో కొత్తూరు అమ్మవారి శాల కొత్త కమిటీని నిర్బంధంగా ఎంపిక చేశారు. వ్యాపారం, సమాజ సేవకే అంకితమై.. శాంతికాముకులుగా ఉంటున్న ఆర్యవైశ్యులపై దౌర్జన్యం చేసి.. నిర్బంధంగా చైర్మన్‌ను తప్పించి.. కొత్త వారిని ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత పది సంవత్సరాలుగా చైర్మన్‌గా ఉంటున్న వ్యక్తిని తప్పించడానికి ఏకంగా ఇన్‌చార్జ్ మంత్రి, అనంతపురం అర్బన్ ప్రజాప్రతినిధి అండదండలు అందించారని ఆర్యవైశ్యులు పేర్కొంటున్నారు. తర్వాత డీఎస్పీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి.. ఎలాంటి ఎన్నికలు జరగకుండానే చైర్మన్ ఎంపిక నిర్వహించినట్లు ఆర్యవైశ్యులు వాపోతున్నారు.
నిధులు కొల్లగొట్టడానికేనా..?
కొత్తూరు అమ్మవారి శాలలో ‘పచ్చ’ నేతలు మకాం వేయాలని గత ఏడాది నుంచి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తూరు ప్రాంతంలో దాతల సహకారంతో ఆలయంలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొత్తూరు ప్రాంతంలోని ఆర్యవైశ్యులకు సభ్యత్వంతో పాటు.. ఓటు హక్కు ఉంటుంది. కానీ తాజాగా పాతూరు ప్రాంతంలోని వ్యక్తులు జోక్యం చేసుకుని.. కొత్తూరు అమ్మవారి శాల కార్యవర్గ ఎంపికలో పాల్గొన్నారు. నిధులు కొల్లగొట్టేందుకే ఈ తరహా రాజకీయాలకు తెరలేపారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గెలుస్తామనే ధీమా ఉంటే ..ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవచ్చు. అలా కాకుండా బెదిరింపు ధోరణిలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రైవేట్ ఆలయాలపైనా ‘పచ్చ’నేతల పెత్తనం
దౌర్జన్యంగా కొత్తూరు అమ్మవారి శాల చైర్మన్ మార్పు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా కమిటీ ప్రకటన
పోలీసులను అడ్డుపెట్టుకుని.. ఎన్నికలు నిర్వహించకుండా మోకాలడ్డు
గుడిపై రాజకీయాలు ఏంటని ప్రశ్నిస్తున్న ఆర్యవైశ్యులు


