కుందుర్పి: మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..వెంకటేష్ తెల్లవారుజామునే తన వ్యవసాయ పొలానికి బయలుదేరాడు. దారి మధ్యలో పొదల చాటు నుంచి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంకటేష్ కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల రైతులు కూడా జతకలిసి గట్టిగా కేకలు వేశారు. దీంతో భయడిన ఎలుగుబంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి పరుగు తీసింది. వెంకటేష్ తలపైన, కాళ్లకు ఎలుగుబంటి తీవ్రంగా కరచి గాయపరిచింది. అతన్ని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కుందుర్పి, తెనగల్లు, ఎనుములదొడ్డి, జంబుగుంపల పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. రైతులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తిరు ఓనం.. భక్తపారవశ్యం
● ప్రశాంతి నిలయంలో ఘనంగా ఓనం వేడుకలు
● కేరళం సంస్కృతిని చాటిచెప్పిన భక్తులు
ప్రశాంతి నిలయం: తిరు ఓనం వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. కేరళ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ వందలాది మంది కేరళీయులు నిర్వహించిన కార్యక్రమాలతో భక్తులు పారవశ్యం చెందారు. ఓనం వేడుకల్లో భాగంగా బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో తిరు ఓనం వేడుకలు నిర్వహించారు. ఉదయం కొబ్బరి పూతతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూర్ణ కుంభాన్ని సత్యసాయి మహాసమాధి చెంత ఉంచి పూజా క్రతువులు నిర్వహించారు. అనంతరం కర్ణాటక శాసీ్త్రయ సంగీత కళాకారుడు కవళం శ్రీకుమార్ బృందం సంగీత విభావరి నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో నిర్వహించిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం ‘ప్రాణ సఖ భగవాన్’ పేరుతో ఎర్నాకుళం జిల్లా బాలవికాస్ చిన్నారులు నాటిక ప్రదర్శించారు. భక్తితో ఆరాధించే వారికి దేవుడు ప్రాణస్నేహితుడి వలే వెంట ఉండి సన్మార్గ దర్శనం చేస్తాడన్న సందేశాన్నిచ్చారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


