ఆలయ మాన్యం ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

ఆలయ మాన్యం ఆక్రమణ

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

కళ్యాణదుర్గం: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో గాలిమరల కంపెనీ ఏకంగా దేవదాయ శాఖకు చెందిన మాన్యం భూమిని ఆక్రమించింది. అధికారులకు, గ్రామస్తులకు ఎటువంటి సమాచారం తెలపకుండా చింతచెట్లను తొలగించి.. యథేచ్ఛగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసింది. కంబదూరు మండలం రాళ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఆంజనేయస్వామి, శివాలయం ఆలయాలకు సంబంధించి సర్వే నంబర్‌ 97, సర్వే నంబర్‌ 99లో 57.67 ఎకరాల శోత్రియం భూమి ఉంది. ఇందులో పూజారులకు, దేవాలయ ధూప, దీప నైవేద్యం ఖర్చులకు ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయాన్నే వినియోగించేవారు. అంతేకాకుండా గ్రామ అవసరాలకు కూడా ఈ మొత్తంలో నుంచే ఖర్చు చేస్తూ వస్తున్నారు. సదరు భూమిలో ఐదేళ్ల క్రితం బోరు వేయించి, చింత మొక్కలు నాటి సంరక్షిస్తూ వస్తున్నారు.

మాన్యం ఆక్రమణతో అలజడి

రాళ్లపల్లిలోని దేవదాయ శాఖకు చెందిన మాన్యం భూముల చుట్టుపక్కల ఓ కంపెనీ గాలిమరలు ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లడం కోసం మాన్యం భూములపై కన్నేసింది. అధికార టీడీపీ నాయకుల అండదండలు చూసుకుని ఇటీవల సదరు కంపెనీ వారు అధికారులకు గానీ, గ్రామస్తులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చింతచెట్లను కూల్చేశారు. రాకపోకలకు అనుగుణంగా చదును చేశారు. గాలిమరల విద్యుత్‌ కోసం ఎనిమిది స్తంభాలను నాటారు.

భారీ వాహనాల రాకపోకలతో

ఇబ్బందులెన్నో..

గాలిమరల కంపెనీకి చెందిన భారీ వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో రాళ్లపల్లిలో గ్రామంలో రోడ్లు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి. నీటి సరఫరా ఆగిపోవడంతో సమీపంలోని పొలాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము, ధూళి ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు శ్వాసకోశ సంబంధిత రోగాలతో బాధపడుతున్నట్లు పలువురు గ్రామస్తులు వాపోయారు. భారీ వాహనాలను గ్రామం బయట వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై దేవదాయ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

రాళ్లపల్లిలో ఆలయ భూమిలో ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాలు

భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమైన తాగునీటి పైపులైన్లు

చర్యలు తీసుకోవాలి

రాళ్లపల్లి గ్రామానికి ఆదాయ వనరుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ మాన్యంలోని చింత చెట్లను గాలిమరల కంపెనీ నిర్వాహకులు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా తొలగించారు. భూమిని ఆక్రమించుకుని సుమారు 8 కరెంటు స్తంభాలు వేసుకున్నారు. ఆలయ భూమిలో ఒక వైపు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. దీనిపై కంపెనీ నిర్వాహకులతో అధికారులు మాట్లాడి నష్టపరిహారం కట్టించి, చర్యలు తీసుకోవాలి.

– శ్యామంత్‌రెడ్డి, రాళ్లపల్లి

చింతచెట్లు తొలగించి విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

అధికార పార్టీ అండతో గాలిమరల కంపెనీ నిర్వాకం

భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతిన్న రోడ్లు, పైపులైన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement