అనంతపురం టవర్‌క్లాక్: మాయ మాటలతో నమ్మించి తన తమ్ముడు ఆస్తి, బంగారును లాక్కున్నాడని నార్పలకు చెందిన లక్ష్మిదేవి వాపోయారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తన మనవడు పవన్ కుమార్‌తో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. గత ఏడాది తన భర్త రామాంజినేయులు మృతి చెందగా, మంచి చెడ్డలు చూస్తానంటూ తన తమ్ముడు కోనంకి శ్రీరాములు నమ్మ బలికి అనంతపురం తీసుకెళ్లాడన్నారు. ఆ తరువాత 30 తులాల బంగారం తీసుకుని మోసం చేశాడన్నారు. నార్పలలో తమ రెండు ఇళ్లను కూడా బెదిరించి రాయించుకుని గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక కుమార్తె ఉండగా, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారని, గతంలో ఇంటిని వారి పేరు మీద రాయించామన్నారు. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గంఎమ్మెల్యే మనుషులమంటూ తన మనవడిని పలువురు కొట్టి బెదిరించారని వాపోయారు. తన తమ్ముడి కుమార్తె తనకు ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి మత్తు వచ్చేలా చేసిందని బోరున విలపించారు. వారి నుంచి బయట పడి నార్పల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన మనవళ్లకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలన్నారు. రెండు ఇళ్లు, 30 తులాల బంగారం తిరిగి ఇప్పించాలని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని, అయినా న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.


