అనంతపురం న్యూటౌన్: జిల్లా ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో మహమ్మారి పంజా దెబ్బకు జిల్లావ్యాప్తంగా వాన జాడ కరువైంది. ఆగస్టు దాటిపోతున్నా వరుణుడి కరుణ లేకుండా పోయింది. ఫలితంగా వ్యవసాయం, వ్యవసాయధారిత రంగాలన్నీ కుదేలయ్యాయి. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, పశుగ్రాసం కొరత, తాగునీటి ఎద్దడి, జీవనోపాధి లేక వలస బాట పట్టిన కూలీలను ఆదుకోవడం తదితర ప్రధాన అంశాలపై సభ్యులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాగేందుకు నీళ్లు ఇవ్వండి
సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చాలంటూ ప్రజలు ఇటీవల రోడ్లెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. రాయదుర్గం, శింగనమల, అనంతపురం తదితర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సర్వసభ్య సమావేశంలో తాగునీటి సమస్యపై పూర్తిస్థాయిలో చర్చిస్తే తప్ప ప్రజల దాహార్తి తీరే పరిస్థితులు కనిపించడం లేదు.
వీటిపైనా దృష్టి సారించండి..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త పెన్షన్ల మంజూరు సంగతి ఏమో గానీ ఉన్న వాటిలోనే వివిధ కారణాలతో తొలగిస్తూ పేదల పొట్ట కొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయింది. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం పేదల నుంచి దూరం చేస్తుందన్న సంగతి బహిరంగ రహస్యమే. సభ్యులు ఈ అంశాలపై చర్చించి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చినప్పుడే ఇలాంటి సభల సమావేశాలకు సార్థకత చేకూరే అవకాశం ఉంది.
ఉరవకొండలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు (ఫైల్)
ఇటీవల కణేకల్లు వద్ద సాగు నీటి విడుదల కోసం రైతుల ధర్నా
హెచ్‌ఎల్‌సీ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలి. లేకుంటే ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలి. హంద్రీ–నీవా నుంచి వచ్చే నీటిలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించాలి. ప్రతి గ్రామంలో దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలి. ఇతర సౌకర్యాలు కల్పించాలి. డప్పు, చర్మకారులు, ఉరుముల కళాకారులు, కాటికాపర్లకు పింఛన్ ఇవ్వాలి. శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్‌కు బకాయి వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ ఇవ్వాలి. – ఒడ్డుపల్లి నల్లప్ప,
సీపీఎం జిల్లా కార్యదర్శి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ వాళ్లే. అయినా, ఎవరూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు, ముందు పండ్ల తోటలను కాపాడు స్వామీ అని మేము కోరుతున్నాం. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే చెట్లకు ట్యాంకర్లతో నీటిని పెట్టాల్సి వస్తుంది.
– అనంత వెంకట రామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
జిల్లావ్యాప్తంగా విపత్కర పరిస్థితులు
రోడ్డెక్కినా తీరని దాహం కేకలు
సాగునీటి కోసం అన్నదాతల తహతహ
కనుచూపు మేరలో కనిపించని సహాయక చర్యలు
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం


