ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ పనుల అడ్డగింత

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

కూడేరు: పొలంలో టవర్‌ ఏర్పాటు విషయంలో భూ యజమానికి, టవర్‌ కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తక్కువ పరిహారం నేపథ్యంలో తన పొలంలో ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ వేయొద్దంటూ కమ్మూరుకు చెందిన కోనంకి శ్రీధర్‌ బుధవారం పనులను అడ్డుకున్నారు. ఒక టవర్‌ ఏర్పాటుకు రూ.20–30 లక్షల వరకు ఇవ్వాల్సి ఉండగా, తక్కువ ఇచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి కమిటీ తీర్మానం మేరకు ఒక టవర్‌ ఏర్పాటుకు రూ.3–6 లక్షల వరకు నష్ట పరిహారం ఫిక్స్‌ చేశారన్నారు. పరిహారం ఇంకా ఎక్కువ కావాలని ఉంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో భూ యజమాని, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

కూడేరు: మండల పరిధిలోని అరవకూరు చెరువు మలుపు వద్ద అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురంలోని కలెక్టర్‌ కార్యాలయ సమీపాన నివాసముంటున్న మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతని కనుగుడ్లు రెండూ బయటకు వచ్చాయి. రోడ్డు పక్కన పడి ఉన్న అతన్ని అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి 108కి సమాచారమివ్వగా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతనిని అనంతపురంలో సర్వజన ఆస్పత్రిలో చేర్చారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంలో వెళుతూ అదుపు తప్పి కింద పడ్డాడా.. లేక ఏదైన వాహనం ఢీకొందా అనేది తెలియాల్సి ఉంది.

మహిళ అదృశ్యం

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని 8వ వార్డు కృష్ణాశ్రమం ఏరియాకు చెందిన చేనేత కార్మికుడు నాగరాజు భార్య బి.సరోజమ్మ అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. అన్ని చోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సరోజమ్మ ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు గాని, పోలీసులకు గాని తెలపాలని కోరారు.

శ్రీశైలంలోనే ఆ ఐదుగురి అంత్యక్రియలు

బత్తలపల్లి: కుటుంబ కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అంత్యక్రియలను అక్కడే పూర్తి చేశారు. బత్తలపల్లి మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన పల్లపు సుధాకర్‌ (36), అతని సోదరులు ఆదిలక్ష్మి (50), మల్లీశ్వరి (45), శ్రీదేవి (38), మల్లీశ్వరి కుమారుడు మణికంఠ (14)లు రెండు రోజుల క్రితం శ్రీశైలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పల్లపు సుధాకర్‌ రక్త సంబంధీకులు శ్రీశైలం వెళ్లగా.. వారు కడసారి చూపులు చూసిన తరువాత ఐదుగురి మృతదేహాలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ

ఉరవకొండ: స్థానిక అనంతపురం–బళ్లారి బైపాసు వద్ద ఉన్న గాయత్రి ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షాపు యజమాని చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపు వెనుక వైపు షట్టర్‌ను కట్‌ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు రూ.10 వేల నగదుతో పాటు రూ.70 వేల విలువ చేసే సామాన్లు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు చిక్కకుండా డీవీఆర్‌ను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement