అనంతపురం ఎడ్యుకేషన్: ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం సమంజసం కాదని ఏపీటీఎఫ్ (1938) అనంతపురం జిల్లా శాఖ పేర్కొంది. టెట్ నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ 20 నుంచి 30 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని మరోసారి పరీక్షించడం అశాసీ్త్రయమైన విధానమని విమర్శించారు. తమ వద్ద విద్యనభ్యసించిన వారు కలెక్టర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లుగా ఎదిగారని, అలాంటి ఉపాధ్యాయులకు మళ్లీ అర్హత పరీక్ష పెట్టడం సరికాదన్నారు. తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. టెట్ రద్దు అమల్లోకి వచ్చే వరకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక మినహాయింపులతో ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరారు. ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు అవసరమైన మినహాయింపులు కల్పించలేదని, గత టెట్ ఫలితాలు విడుదల కాకముందే మరో పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఉపాధ్యాయులకు తగినంత సమయం ఇవ్వాలని కోరారు. పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలన్నారు. అందరికీ 40 శాతం ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు జి.రవీంద్ర, ప్రధాన కార్యదర్శి హనుమప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ నాయక్, జిల్లా అదనపు కార్యదర్శి పోతులయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు (ఉర్దూ) మహమ్మద్ రఫీ, రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యుడు సాకే భాస్కర్, మహిళా కమిటీ సభ్యురాలు బండి సరిత పాల్గొన్నారు.


