నెల్లూరు ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు ఘన విజయం

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న సౌత్‌జోన్‌ ఏసీఏ అండర్‌–23 మెన్స్‌ మల్టీ డే క్రికెట్‌ టోర్నీలో కర్నూలు జట్టుపై నెల్లూరు జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక.. వైఎస్సార్‌ కడప, చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

● మొదటి ఇన్నింగ్స్‌లో కర్నూలు జట్టు 125 పరుగులకు ఆలౌట్‌ కాగా, నెల్లూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 324 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 324 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆటను కొనసాగించిన నెల్లూరు జట్టు 107 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 496 పరుగుల వద్ద ఆటను డిక్లేర్‌ చేసింది. నెల్లూరు బ్యాటర్‌ పవన్‌ రిత్విక్‌ 168 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. అలాగే కారుణ్య ప్రసాద్‌ 60, సుతేజ్‌రెడ్డి 89, మన్విత్‌రెడ్డి 57 పరుగులు చేశారు. కర్నూలు బౌలర్లు సబ్జాన్‌ బాసా 3, అక్షిత్‌రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 30.1 ఓవర్ల వద్ద 107 పరుగులకు ఆలౌట్‌ అయింది. నెల్లూరు బౌలర్‌ అఖిల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే అభినయ్‌రెడ్డి 2, భార్గవ్‌ మహేష్‌ 3 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 264 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

కడప, చిత్తూరు జట్ల మ్యాచ్‌ డ్రా

తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైఎస్సార్‌ కడప జట్టు 321 పరుగులకు ఆలౌట్‌ కాగా, చిత్తూరు జట్టు 217 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో 16 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్‌ కడప జట్టు 68.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 321 పరుగులకు ఆటను డిక్లేర్‌ చేసింది. కడప బ్యాటర్‌ ఆదిల్‌ హుస్సేన్‌ 122 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్‌ సుదర్శన్‌ 80 బంతుల్లో 57 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లలో సాయిచరణ్‌ 5 వికెట్లు కూలదోశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో చిత్తూరు జట్టు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. దీంతో కడప జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించగా, మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

విజేత నెల్లూరు జట్టు, 5 వికెట్లు తీసిన చిత్తూరు బౌలర్‌ సాయిచరణ్‌, నెల్లూరు బౌలర్‌ అఖిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement