ఎస్సీ హాస్టల్‌ విద్యార్థిది ప్రభుత్వ హత్యే | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ హాస్టల్‌ విద్యార్థిది ప్రభుత్వ హత్యే

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

దళితులంటే చిన్నచూపా లోకేష్‌?

ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు

శెట్టూరు: మండల కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహం విద్యార్థి హర్షవర్ధన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు ధ్వజమెత్తారు. బుధవారం బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ప్రభాకర్‌, హేమవతి, ఏపీ ఎంఆర్‌పీఎస్‌ నాయకులతో కలిసి శెట్టూరులోని ఎస్సీ సంక్షేమ వసతిగృహాన్ని పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులంటే చిన్నచూపా..? అని మంత్రి లోకేష్‌ను నిలదీశారు. రెండు రోజుల క్రితం కణేకల్లుకు వచ్చిన ఆయన ఒక దళిత విద్యార్థి గోడ కూలి మృతి చెందితే ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు, వసతి గృహాల అధికారుల ఘోర నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి హర్ష వర్ధన్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మంత్రి లోకేష్‌ స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. హర్షవర్ధన్‌ కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చదివించాలన్నారు. గాయపడిన అక్షయ్‌కు తక్షణ సాయం కింద రూ.5 లక్షలు అందించడంతో పాటు కార్పొరేట్‌ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్‌, ఏఎస్‌డబ్ల్యూ, డీడీలను తక్షణమే డిస్మిస్‌ చేసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గూబనపల్లి నాగరాజు, తాలూకా అధ్యక్షుడు డాబా రమేష్‌, వివిధ మండలాల అధ్యక్షులు సురేష్‌, దేవరాజు, హరి, రమేష్‌, సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement