అనంతపురం: ఫుట్‌బాల్ ప్రియులను అలరించేలా మరో జాతీయ స్థాయి టోర్నీకి అనంతపురం అతిథ్యం ఇవ్వనుంది. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా డాక్టర్ తాలిమెరెన్ ఏఓ నేషనల్ ఫుట్‌బాట్ చాంపియన్‌షిప్ (టైర్–1) జూనియర్ బాలికల టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 10 నుంచి రోజూ రెండు మ్యాచ్‌లు చొప్పున జరగనున్నాయి. అదే నెల 25న ఫైనల్స్ నిర్వహించనున్నారు.
తలపడనున్న హేమాహేమీ జట్లు
మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించి టోర్నీని నిర్వహించనున్నారు. గ్రూప్ ‘ఏ’ లో మణిపూర్, చత్తీస్‌గడ్, ఉత్తరప్రదేశ్, కేరళ, గ్రూప్ ‘బీ’లో వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, గ్రూప్ ‘సీ’లో ఢిల్లీ, గుజరాత్, బిహార్, జార్ఖండ్, గ్రూప్ ‘డీ’లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ఒక మ్యాచ్, మధ్యాహ్నం 3 గంటలకు మరో మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జట్లు సెప్టెంబర్ 8 నుంచి జిల్లాకు చేరుకోనున్నాయి.


