సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేస్తున్న దొంగల కన్ను ఏటీఎం సెంటర్లపైనా పడింది. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతుండడంతో చోరీల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా అభివృద్ధి చెందిన నేటి కాలంలోనూ దొంగలను పట్టుకోలేకపోతున్న పోలీసు శాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్మవరంలో 5 నిమిషాల్లోనే..
ధర్మవరం పట్టణంలో మెయిన్ రోడ్డుపై ఉన్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకును దొంగలు టార్గెట్‌గా చేసుకున్నారు. కేవలం 5 నిమిషాల్లో ఏటీఎం మెషీన్‌ను పెకిలించి బొలెరో వాహనంలో వేసుకుని ఉడాయించారు. కొంత దూరం వెళ్లాక మెషీన్‌ను పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.5 లక్షలను తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ ఏడాది మే 6న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ చోరీ జరిగి మూడు నెలలు గడిచినా దొంగలను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు.
గుంతకల్లులో విఫలయత్నం
గుంతకల్లు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా సర్కిల్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు దొంగలు తీవ్ర ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ఏడాది జూన్13న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏటీఎం మెషీన్‌ను తాళ్లు, వైర్లతో కట్టి పెకిలించి బయటికి తీసుకొచ్చారు. గట్టిగా శబ్దం రావడంతో స్థానికులు మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో మెషీన్‌ను వదిలేసి దొంగలు ఉడాయించారు.
బీకేఎస్‌లో పోలీస్ స్టేషన్ పక్కనే చోరీ...
గుంతకల్లు ఘటన మరువకముందే బుక్కరాయసముద్రంలో అనంతపురం – తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన, పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 17న తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో దుండగులు మినీ వ్యాన్‌లో వచ్చి ఎస్‌బీఐ ఏటీఎం మెషిన్‌కు తాళ్లు కట్టి ఈడ్చుకెళ్లారు. అక్కడి నుంచి దాన్ని శింగనమల మండలం ఆకులేడు సమీపంలోకి తీసుకెళ్లి బద్దలు కొట్టి.. అందులో ఉన్న రూ.15.84 లక్షలు తీసుకున్న తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇదంతా 7 నిమిషాల్లో పూర్తయింది. అయితే ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం.. అలాగే దొంగతనం జరిగినప్పుడు అప్రమత్తం చేసే భద్రతా వ్యవస్థ లేకపోవడంతో చోరీని ఈజీగా ముగించారు. నాలుగు గంటల తర్వాత స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
పోలీసులపైనే దొంగల దాడి
ధర్మవరం కేసును దాదాపు ఛేదించామని పోలీసులు భావించారు. నిందితుల జాడ కనిపెట్టి వారున్న ప్రదేశానికి చేరుకుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన దుండగులు ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో పోలీసుల మీదే దాడికి ప్రయత్నించారు. నిందితులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేయడంతో పోలీసులు ఆత్మరక్షణకు దిగారు. దుండగుల దాడిలో ఓ హోంగార్డుకు రెండు చేతులు విరిగినట్లు సమాచారం. అలాగే ఓ సీఐకు కూడా దెబ్బలు తగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ముందుకుసాగని దర్యాప్తు
ఏటీఎం మెషిన్లలో డబ్బు చోరీ చేసిన నిందితులు కరడుగట్టిన నేరస్తులన్న సంగతి పోలీసులకు తెలియడంతో దర్యాప్తు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీలు వరుసగా జరుగుతున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులపై దాడి జరిగిన విషయం తెలియడంతో దర్యాప్తు బృందంలోకి వెళ్లేందుకు పోలీసు సిబ్బంది నిరాకరిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌లో చర్చ నడుస్తోంది.
మూడు నెలల వ్యవధిలో మూడు ఏటీఎం చోరీలు జరిగినా ఏ ఒక్క ఘటనలోనూ పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. ధర్మవరం ఘటనలో ఇద్దరు అనుమానితులను పట్టుకున్నా వారు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. గుంతకల్లు ఘటనలోనూ అనుమానితులనే అదుపులోకి తీసు కుని విచారిస్తున్నట్లు సమాచారం. చోరీల దర్యాప్తు కోసం రెండు జిల్లాల ఎస్పీలు ప్రత్యేక బృందాలను నియమించి వేట ప్రారంభించారు. ప్రధాన నిందితులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.
పేట్రేగిపోతున్న చోరులు
పోలీసులకు సవాల్‌గా ఏటీఎం చోరీలు
3 నెలలు గడిచినా దర్యాప్తులో కనిపించని పురోగతి


