రెండో రోజూ కొనసాగిన ‘జూడా’ల సమ్మె | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కొనసాగిన ‘జూడా’ల సమ్మె

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది. పనికి తగినట్లుగా స్టయిపెండ్‌ పెంచాలని, 2024 ఎన్నికల సమయంలో జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అధికారం చేపట్టి దాదాపు మూడో ఏడాది కావస్తున్నా హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సర్వజనాస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గురుకులం విద్యార్థి అదృశ్యం

కణేకల్లు: కణేకల్లు క్రాస్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం పాఠశాల విద్యార్థి బుధవారం అదృశ్యమయ్యాడు. అధ్యాపకులు, పోలీసుల కథనం మేరకు... గుమ్మఘట్ట మండలం రంగచేడు గ్రామానికి చెందిన పీకే తిప్పేస్వామి కుమారుడు పీకే శివకుమార్‌ కణేకల్లు క్రాస్‌లోని గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ బైపీసీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి అల్పాహారం తీసుకున్నాడు. ఆ తర్వాత తరగతి గదిలో శివకుమార్‌ కన్పించలేదు. బ్రేక్‌ ఫాస్ట్‌ సమయంలో ఉన్నాడని, ఆ తర్వాత ఏమయ్యాడో, ఎక్కడికెళ్లాడో తమకు తెలీదని తోటి విద్యార్థులు చెప్పారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ వెంకటనాయుడు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమివ్వగా... వారు బంధువులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఎక్కడ ఆచూకీ కన్పించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఓ వైపు గురుకులం సిబ్బంది.. మరోవైపు పోలీసులు శివకుమార్‌ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

హంద్రీ–నీవా

సీఈ బాధ్యతల స్వీకరణ

అనంతపురం సెంట్రల్‌: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సీఈగా బాలచంద్రారెడ్డి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) స్వీకరించారు. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రాజెక్టు సీఈగా ఉన్న ఆయనకు అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇది వరకూ ఇక్కడ ఉన్న రిటైర్డ్‌ సీఈ నాగరాజ విధుల్లో కొనసాగే అవకాశమున్నప్పటికీ విజయవాడలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో జరిగిన వివాదంతో రాజీనామా చేసిన విషయం విదితమే. బుధవారం బాధ్యతలు స్వీకరించిన బాలచంద్రారెడ్డికి ఏపీఎన్‌జీఓ నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, సహాధ్యక్షులు శ్రీనివాసులు, సెక్రటరీ ఉమాశంకర్‌, నాయకులు సుధాకర్‌రెడ్డి, శివనాగప్రసాద్‌, అనంతశయన, వీరేంద్రనాథ్‌, మహబూబ్‌బాషా, రాజేష్‌, నారాయణస్వామి, వీరాంజనేయులు తదితరులు స్వాగతం పలికారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

రాప్తాడు రూరల్‌: రాప్తాడు, ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్లను ఎస్పీ జగదీష్‌ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్‌, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. రాప్తాడు పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టి ప్రమాదాల సంఖ్యను తగ్గించేలా కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement