రాప్తాడు రూరల్: భార్య మృతిని జీర్ణించుకోలేక ఓ భర్త బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రాప్తాడు మండలం వరిమడుగులో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. వరిమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (56) భార్య సుధామణి రెండు వారాల క్రితం అకస్మికంగా మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె మృతిని చంద్రశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. బంధువుల వద్ద తరచూ తన బాధ వ్యక్తం చేసేవాడు. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినా విషాదం తగ్గలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన బంధువులు, స్థానికులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చంద్రశేఖర్‌రెడ్డికి కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి, కుమార్తె భవ్య ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలు జరిగాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫోన్‌లో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు, కుమారుడితో మాట్లాడి ఓదార్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రిలో చంద్రశేఖర్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాప్తాడు మండల కన్వీనర్ సాకే వెంకటేష్, యువజన విభాగం కన్వీనర్ విశ్వనాథరెడ్డి, నాయకులు సత్తిరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, హంపాపురం సింగారప్ప, గద్దె రామకృష్ణారెడ్డి, నరసింహులు, గవ్వల మల్లికార్జున ఉన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
గుమ్మఘట్ట: మండలంలోని పూలకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనిత రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఆనందరావు, పీడీ రామాంజినేయులు తెలిపారు. ఈ నెల 11న అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అమరావతి ఛాంపియన్‌షిప్ బాలికల అండర్–17 కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో అనిత విశేష ప్రతిభ కనబరచడంతో త్వరలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని గ్రామస్తులు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.
వాలీబాల్ పోటీలకు హంపాపురం విద్యార్థినులు..
రాప్తాడు రూరల్: అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా రెండు రోజుల కిందట అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో మండల పరిధిలోని హంపాపురం ఉన్నత పాఠశాల విద్యార్థినులు నిహారిక, చందన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 విభాగంలో ఎంపికై న విద్యార్థినులు ఈ నెల 20 నుంచి తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు ముస్తఫా విద్యార్థినులను అభినందించారు.


