పేదల బియ్యంపై పందికొక్కులు | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యంపై పందికొక్కులు

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌)/ఆత్మకూరు:పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పందికొక్కుల్లా బియ్యాన్ని బొక్కేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాల్లో తిరిగి కొందరు బియ్యాన్ని సేకరించి దళారులకు తక్కువ ధరకే అప్పగిస్తే.. వారు ఆ బియ్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాలైన బొమ్మనహాళ్‌, డీ హీరేహాళ్‌, రాయదుర్గం, కణేకల్లులో యథేచ్ఛగా దందా సాగుతోంది.

అంతటా అధికార పార్టీ నాయకులే!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రేషన్‌ కార్డులోని ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాయి. కేజీ బియ్యంపై ప్రభుత్వాలు రూ.35 మేర ఖర్చు చేస్తూ ప్రజలకు ఉచితంగా అందిస్తుండడం గమనార్హం. అయితే పలువురు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నుంచి కిలో రూ.18 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి అనంతరం దళారులకు విక్రయిస్తున్నారు. వాటిని దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించి కిలో రూ. 30 నుంచి రూ.40 చొప్పున అమ్మి రూ.లక్షలు గడిస్తున్నారు. బియ్యాన్ని బొక్కేస్తున్న వారిలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకులే ఉంటుండడంతో సివిల్‌ సప్లయీస్‌, పోలీస్‌ అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

ముట్టాల కేంద్రంగా దందా..

ఆత్మకూరు మండలంలోని ముట్టాల కేంద్రంగా బియ్యం దందా జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే మూడు సార్లు గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని పట్టుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. గ్రామ సమీపంలోని ఓ గదిలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వ చేసి, అనంతరం ఐచర్‌ వాహనాల్లో కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ నేతలు తాము ఎమ్మెల్యే సునీత బంధువులమని చెప్పుకుంటూ దర్జాగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి రేషన్‌ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రూ.లక్షలు వెనకేసుకుంటున్న మాఫియా

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దందా

పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న సివిల్‌ సప్లయీస్‌, పోలీసు యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement