నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

గుంతకల్లు రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏటా నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే శ్రావణమాస ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా హాజరుకానున్నారు. ఉత్సవాల్లో భాగంగా 15న మొదటి శనివారం సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 22న రెండవ శనివారం స్వామివార్లను హనుమద్‌ వాహనంపై, 29న మూడవ శనివారం గజ వాహనంపై, సెప్టెంబర్‌ 5న నాల్గవ శనివారం గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు

శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు, నాలుగు మంగళవారాల్లో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తనున్న తరుణంలో వారి సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈఓ మేడేపల్లి విజయరాజు వెల్లడించారు. ఉచిత దర్శనం, ముఖమండప దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపాలతోపాటు, అన్నదాన కేంద్రం పక్కనున్న రేకుల షెడ్డు, గంగా నిలయం, పీఏసీలో ఉన్న డార్మెటరీ హాలులో ఉచిత వసతి ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాగునీటి అవసరాలకై ప్రత్యేకంగా నీటి కుళాయిలు, అదేవిధంగా భక్తుల దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ కేంద్రం ఏర్పాటు చేశారు. శ్రావణ శని, మంగళవారాల్లో భక్తులకు ఆలయ తూర్పు రాజ గోపురం ముందు భాగంలో ఉన్న బెల్డోణ సత్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఉంటుందన్నారు. భక్తుల కాలక్షేపం కోసం హరికథలతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామదూత నిలయం ముందు భాగంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్‌ సిబ్బంది ద్వారా బందోబస్తు, ఆలయ ముందుభాగంలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం గుంతకల్లు రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌ నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement