అనంతపురం అర్బన్: పరిశ్రమల స్థాపన ద్వారానే జిల్లా సమాగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణతో కలిసి జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. జిల్లాలో పనులు ప్రారంభించిన సిల్లవర్ స్పార్క్, సుగుణ స్పాంజ్ ప్రైవేటు లిమిటెడ్, సరళ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన పరిశ్రమలు స్థాపించేందుకు స్థలం కేటాయించామన్నారు. విశ్వకర్మ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు శిక్షణ ఇవ్వడంతో పాటు రుణం మంజూరు చేయాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. నూతన పరిశ్రమల స్థాపనకు 68 దరఖాస్తులురాగా అందులో 48 వాటికి సమావేశంలో ఆమోదం తెలిపారు. రెండు దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 18 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 20 యూనిట్లకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ 1.88 కోట్ల మంజూరుకు ఆమోదించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘టెట్’ తొలిరోజు ప్రశాంతం
● 95 మంది గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) తొలిరోజు బుధవారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ ఎన్.అయూబ్ హుసేన్ తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాలకు గాను ఐదు కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరిగాయి. రెండు సెషన్లకు కలిపి మొత్తం 1,433 మంది అభ్యర్థులకు గాను 1,338 మంది హాజరయ్యారు. 95 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ సమకూర్చడంతో పాటు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
నేటి నుంచి స్పోర్ట్స్
చాంపియన్‌షిప్ పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో గురువారం నుంచి నియోజకవర్గ స్థాయిలో స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ అయూబ్ హుసేన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) మంజుల తెలిపారు. ఏడో తేదీ వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, 6 నుంచి 7వ తేదీ వరకు రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో, 7 నుంచి 10 వరకు అనంతపురం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల జట్లు ఆయా నియోజకవర్గాల్లో జరిగే స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
10న ‘పాలిటెక్నిక్’ స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురంలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తి గల వారు హాజరుకావాలని కోరారు. అనంతపురం పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కళ్యాణదుర్గం, నార్పల, ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఈ నెల 10వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లనూ వెంట తీసుకురావాలన్నారు. తక్షణమే కోర్సు ఫీజు సుమారు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదన్నారు. పాలిసెట్–2026లో అర్హత సాధించిన వారికి తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు హాజరు కావాలన్నారు.


