రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుటుంబం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని కక్షసాధింపు చర్యల్లో భాగంగా లాక్కునే ప్రయత్నం జరుగుతోందంటూ బాధిత రైతు పెద్ద ఓబులేసు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రైతు తల్లి నాగలక్ష్మమ్మ ట్రెయినీ కలెక్టర్ సుయాస్ కుమార్ సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు... పుల్లలరేవుకు చెందిన ఎస్.గోవిందు కుటుంబం గొందిరెడ్డిపల్లి పరిధిలోని 7.76 ఎకరాల భూమిని దాదాపు 40 ఏళ్లుగా సాగు చేస్తోంది. 2001లో గ్రామ పంచాయతీ తీర్మానం, రెవెన్యూ అధికారుల సిఫార్సుల అనంతరం భూమిని అసైన్డ్ వేస్ట్ ల్యాండ్‌గా మార్చారు. అనంతరం 2006లో గోవిందుకు 4.90 ఎకరాలు, 2007లో ఆయన కుమారుడు పెద్ద ఓబులేసుకు 2.86 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేశారు. గోవిందు మరణానంతరం ఆయన పేరిట ఉన్న భూమిని చిన్న కుమారుడు వసంతు పేరుపై ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉంది. భూమిలో బోర్లు, డ్రిప్ వ్యవస్థ, పైప్‌లైన్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నామని, పంట రుణాలు తీసుకుంటూ.. విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నామని పెద్ద ఓబులేసు కుటుంబ సభ్యులు వివరించారు.
కక్షతోనే వేధింపులు
తాము వైఎస్సార్‌సీపీకి మద్దతుదారులమనే కారణంతోనే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత తమపై కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని బాధితులు ఆరోపించారు. తమ భూమిలో టీడీపీ జెండాలు నాటడం, నేరేడు చెట్లు తొలగించడం, కొబ్బరి చెట్లకు నిప్పు పెట్టడం, పైప్‌లైన్లు, మోటార్లు ధ్వంసం చేశారని వాపోయారు. అనంతరం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పేర్లను ఆన్‌లైన్ నుంచి తొలగించి.. భూమిని మిగులు భూమిగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
నోటీసులు ఇవ్వకుండా ఖాళీ
చేయమంటున్నారు
రైతు పెద్ద ఓబులేసు మాట్లాడుతూ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూమి ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడితే పోలీసులతో బెదిరిస్తున్నారని, మూడు రోజుల్లో భూమి ఖాళీ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయమై వివరణ తీసుకునేందుకు రాప్తాడు ఇన్‌చార్జ్ తహసీల్దార్ చెన్నకేశవులును ‘సాక్షి’ ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.
ట్రైనీ కలెక్టర్ ఎదుటే విషాద ఘటన
ట్రైనీ కలెక్టర్ సుయాస్ కుమార్ ఇన్‌చార్జ్ తహసీల్దార్, ఆర్‌ఐ, ఇతర రెవెన్యూ సిబ్బంది, సీఐ, పోలీసులతో కలిసి బుధవారం పుల్లలరేవు గ్రామానికి వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్ద ఓబులేసు, ఆయన తల్లి నాగలక్ష్మమ్మ అక్కడికి చేరుకున్నారు. భూమి ఖాళీ చేయాల్సిందేనంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగలక్ష్మమ్మ తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసు కానిస్టేబుల్ వెంటనే ఆమె చేతిలోని సీసాను లాక్కొని ప్రమాదాన్ని తప్పించారు. కన్నీటి పర్యంతమైన నాగలక్ష్మమ్మ...‘ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో చెట్లు నరికేశారు.. మోటార్లు కాల్చేశారు.. ఇప్పుడు భూమే లేకుండా చేస్తున్నారు. మేము ఎందుకు బతకాలి?’ అంటూ అధికారుల ఎదుటే ఆవేదన వ్యక్తం చేసింది.
మేమెందుకు బతకాలి
ట్రెయినీ కలెక్టర్ సమక్షంలోనే రైతు తల్లి ఆత్మహత్యాయత్నం
రాప్తాడు మండలం పుల్లలరేవులో ఘటన


