అప్రమత్తం చేసినా.. అంతులేని నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తం చేసినా.. అంతులేని నిర్లక్ష్యం

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

ఉరవకొండ: ఉరవకొండతో పాటు మరో ఏడు గ్రామాలకు తాగునీరు అందించే నింబగల్లు సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకులో శనివారం అర్ధరాత్రి మూడవ ట్యాంకు గట్టు తెగిపోయింది. దీంతో నీరుంతా వృథాగా వెళ్లిపోయింది. ఎస్‌ఎస్‌ ట్యాంకులో మొత్తం మూడు ట్యాంకులు ఉన్నాయి. అన్ని ట్యాంకులను అధికారులు గత నెల 29న హెచ్చెల్సీ నీటితో పూర్తిస్థాయిలో నింపారు. ట్యాంకు నిండినప్పటి నుంచి ట్యాంకు లీకవుతుండటంతో పరిసర ప్రాంతాల రైతులు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. గట్టు తెగే ప్రమాదం ఉందని హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరకు అనుకున్నట్టే మూడవ ట్యాంకు గట్టు తెగిపోవడంతో.. నీరు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

నీట మునిగిన పంటలు..

నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకు గట్టు తెగిపోవడంతో పరిసరాల్లోని దాదాపు 20 ఎకరాల్లో పంటలను నీరు ముంచెత్తింది. మిరప, కంది పంటలు దెబ్బతిన్నాయి. ట్యాంకు బలహీనంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేయడం వల్ల పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు ఓబుళమ్మ, నాగలక్ష్మి, లక్ష్మి, గంగమ్మ, వెంకటలక్ష్మి, ఆంజినేయులు, గోనయ్య తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు..

ఎల్‌–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం వల్ల తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండబోతుందని తెలిసినా ఉరవకొండ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే నింబగల్లు సమ్మర్‌ స్టొరేజీ ట్యాంకు గట్టు తెగిందని వైఎస్సార్‌సీపీ నేతలు ముత్తులూరు అశోక్‌, నెరిమెట్ల యోగేంద్రరెడ్డి, రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, డిష్‌ సురేష్‌ మండిపడ్డారు. ఆదివారం వారు నింబగల్లు వద్ద తెగిన ట్యాంకు గట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్యాంకు లీకేజీపై కలెక్టర్‌, స్థానిక అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోక పోవడంతో తాగునీరు 20 ఎకరాల్లోకి పంట నష్టం కలిగించాయన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నింబగల్లు ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

తెగిన నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకు గట్టు

భారీగా తాగునీరు వృథా

20 ఎకరాల్లో నీటమునిగిన పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement