కళ్యాణదుర్గం: దళిత, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అంబేడ్కర్ భవన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. హడావుడిగా శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కళ్యాణదుర్గంలో అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం సర్వేనంబర్ 111–2 లో 94 సెంట్ల స్థలం కేటాయించారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఇంజినీరింగ్ అధికారులు భవన నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. అయితే పనులు చేపట్టడంలో స్థానిక అధికారులు అలసత్వం చేయడంతో నిధులు ఖర్చు చేయకుండానే వెనక్కు పోయాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హడావుడిగా రూ.2.36 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. కానీ ఆరు నెలలు అవుతున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. భవన నిర్మాణం ప్రతిపాదన దశలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.
హడావుడిగా శంకుస్థాపన
ఆరు నెలలైనా ప్రారంభం కాని పనులు
ప్రతిపాదన దశలోనే ఆగిపోయిన వైనం


