చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుందాం | - | Sakshi
Sakshi News home page

చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుందాం

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

అనంతపురం కల్చరల్‌: జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుందామని కలెక్టర్‌ ఆనంద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాశ్‌కుమార్‌, జిల్లా పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌ తదితరులు మాట్లాడారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వ సంపదపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నట్లు చెప్పారు. అంతకు ముందు పాతూరులోని వందళ ఏళ్ల నాటి విక్టోరియా హాస్పిటల్‌, శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం, పురాతన విరూపాక్షేశ్వరాలయం, జామియా మసీదు, బసవన్న కట్ట మీదుగా ఐరన్‌ బ్రిడ్జి వరకు హెరిటేజ్‌ వాక్‌ సాగింది. క్రీ.శ.15వ శతాబ్దం నుండి వివిధ కాలాలలో నిర్మాణమైన ఎన్నో కట్టడాల చరిత్రను తెలియజేయడానికి రాష్ట్రంలోనే హెరిటేజ్‌ వాక్‌ను అనంతపురంలోనే ప్రారంభించడం ఆనందించదగినదని అన్నారు. హెరిటేజ్‌ వాక్‌లో ఇంటాక్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పురావస్తుశాఖ గైడ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి విత్తన

పప్పుశనగకు రిజిస్ట్రేషన్లు

అనంతపురం అగ్రికల్చర్‌: నల్లరేగడి భూముల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసుకునే రైతులకు సోమవారం నుంచి ఆర్‌ఎస్‌కేల్లో రాయితీ విత్తనానికి రిజిస్ట్రేషన్లు మొదలు పెడుతున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఎన్‌.సాలురెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌తో పాటు విత్తనం నిల్వ చేసిన ప్రాంతాల్లో వెనువెంటనే పంపిణీ కూడా చేస్తామన్నారు. జిల్లాకు కేటాయించిన 32,900 క్వింటాళ్లలో ఇప్పటికే 12 మండలాల్లో ఉన్న ఆర్‌ఎస్‌కేలకు 5,900 క్వింటాళ్లు సరఫరా చేశామని తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9 వేలు కాగా అందులో 35 శాతం రాయితీ రూ.3,150 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాలన్నారు. భూమి విస్తీర్ణం బట్టి ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాలకు 200 కిలోల విత్తనం పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కో బస్తా 20 కిలోలు ఉంటుందని పేర్కొన్నారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల, పెద్దపప్పూరు, తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, గార్లదిన్నె, కూడేరు, బెళుగుప్ప, డి.హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌, కణేకల్లు తదితర మండలాల్లో రిజిస్ట్రేషన్లు, పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement