అనంతపురం అగ్రికల్చర్: రబీ సీజన్ ప్రారంభమైంది. వర్షం వస్తే పప్పుశనగ ఇతర పంటలు విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే పెట్టుబడులకు అవసరమైన డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత 2026–27కు సంబంధించి రెండో విడతగా అక్టోబర్‌లో సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు... వెరసి రూ.7 వేలు జమ చేయాల్సి ఉన్నా... ఇంకా ఎప్పుడనేది ప్రభుత్వం ప్రకటించలేదు. సాయం అందితే పెట్టుబడికి పనికి వస్తుందని ఎదురుచూస్తున్నారు.
అర్హుల ఎంపికలో కొర్రీలు..
గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏటా రైతు భరోసా కింద జిల్లాలో 2.90 లక్షల మంది, పీఎం కిసాన్ కింద 2.75 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అర్హుల ఎంపికలో కొర్రీలు వేసి జాబితా కుదించింది. గతేడాది, ఈ ఏడాది సుఖీభవ కింద రూ.2.75 లక్షల మందికి, పీఎం కిసాన్ కింద 2.55 లక్షల మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది. ఇలా వేలాది మంది అర్హులైన రైతులను జాబితాల నుంచి తొలగించేయడంతో సాయం అందకుండా పోతోంది. దీనికితోడు 10 వేల మందికి పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారులను అస్సలు పట్టించుకోవడం లేదు. గతంలో వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం అందించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 20న విడుదల చేసిన మొదటి విడత సొమ్ము ఇంకా చాలామందికి అందని పరిస్థితి నెలకొంది. ఈ–కేవైసీ కాలేదని, ఎన్‌పీసీఐ యాక్టివ్‌గా లేదని, మ్యాపింగ్ కాలేదంటూ ఇలా రకరకాల కారణాలతో వ్యవసాయశాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అటు వ్యవసాయం ఇటు ఉద్యానవనం, పాడి పశుపోషణ లాంటి ప్రత్యామ్నాయం సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు సర్కారు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.
నాడు ఠంచన్‌గా సాయం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్ – రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం జూన్, అక్టోబర్, పంటకోతలు జరిగే సంక్రాంతికి ఇలా... మూడు విడతల్లో క్యాలెండర్ ప్రకారం పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. ఐదేళ్ల కాలంలో ప్రతి రైతుకూ రూ.67,500 ప్రకారం భరోసా కల్పించారు. అలా ఐదేళ్ల కాలంలో 14.35 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.1,937 కోట్లు పెట్టుబడిసాయం జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితులు లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు.
సుఖీభవ, పీఎం కిసాన్ కోసం అన్నదాత ఎదురుచూపు రబీ ప్రారంభమైనా సాయం ప్రకటించని చంద్రబాబు సర్కారు


