విద్యుత్‌ ఉత్పత్తికి శాపం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉత్పత్తికి శాపం

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

నిర్వహణ లోపం..

కూడేరు: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పీఏబీఆర్‌ డ్యాం వద్దనున్న జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. 1994 జనవరిలో 20 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీ జెన్‌కో ఈ కేంద్రంలో రెండు టర్బైన్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి అధికారులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్టాప్‌లాగ్‌ గేట్లు లేకపోవడంతోపాటు ఉన్న గేట్లు కూడా సరిగా లేకపోవడం, నీటి కొరతతో ప్రాజెక్టు వద్ద విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. డ్యాంలో నీరు ఉన్న సమయంలోనూ సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించి నిర్వహణ లోపాలను సరిచేసి జల విద్యుత్‌ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతుండడంతో 2025 మార్చి నుంచి జల విద్యుత్‌ కేంద్రం అలంకారప్రాయంగా మారింది.

రోజుకు 72 వేల యూనిట్ల విద్యుత్‌..

ఒక టర్బైన్‌కు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తే గంటకు సుమారు 3500 – 4500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన రోజుకు సుమారు 72 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను కళ్యాణదుర్గం వెళ్లే విద్యుత్‌ లైన్లకు అనుసంధానం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల విద్యుత్‌ ఉత్పత్తికి విరామం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ కేంద్రం ద్వారా సుమారు 16 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయినట్టు తెలుస్తోంది.

శాపంలా సాంకేతిక లోపాలు

నీటి కొరత ఒకవైపు విద్యుత్‌ ఉత్పత్తికి అడ్డంకిగా నిలుస్తుంటే, సాంకేతిక లోపాలు మరోవైపు జల విద్యుత్‌ ఉత్పత్తికి శాపంగా మారింది. ఇక్కడ జల విద్యుత్‌ తయారీ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపి వేసిన సమయంలో నీటి సరఫరాను ఆపేందుకు అత్యవసరంగా అవసరమయ్యే స్టాప్‌లాగ్‌ గేట్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేసిన తర్వాత కూడా గేట్లు పూర్తిగా కిందికి దిగడం లేదు. ఫలితంగా లీకై న నీరు టర్బైన్ల వైపు వచ్చే ప్రమాదం లేకపోలేదు.

పట్టించుకోని అధికారులు

రూ.కోట్లు వెచ్చించి బృహత్‌ సంకల్పంతో నిర్మించిన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, నిర్వహణ లోపంతో మూలనపడే స్థితికి చేరుకుంది. నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడమే కాక తక్షణమే స్టాప్‌ లాగ్‌ గేట్ల సమస్యను పరిష్కరించి జల విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పీఏబీఆర్‌లో నిలిచిన జల విద్యుత్‌ ఉత్పత్తి

చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో

అలంకారప్రాయంగా మారిన వైనం

సాంకేతిక సమస్యలు,

గేట్ల ఏర్పాటులో సర్కార్‌ విఫలం

సమస్యలు పరిష్కరించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటున్న జిల్లా వాసులు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

విద్యుత్‌ ఉత్పత్తికి నీటి కొరత, సాంకేతిక సమస్యలున్నాయి. రెండు రోజుల క్రితం శ్రీశైలం జలాశయం చీఫ్‌ ఇంజనీర్‌ మురళీకృష్ణ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. స్టాప్‌ లాగ్‌ గేట్లు, ప్రస్తుతం ఉన్న గేట్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. సాంకేతిక సమస్యలను పరిష్కంచేందుకు చర్యలు చేపడతామన్నారు.

– కేశవయ్య, డీఈ, జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement