‘అనంత’ ఆశలకు ఊపిరి | - | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఆశలకు ఊపిరి

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

కళకళలాడుతున్న టీబీ డ్యాం, మల్యాల వద్ద హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

అనంతపురం సెంట్రల్‌: ‘అనంత’ ఆయకట్టు రైతుల ఆశలకు ఊపిరి వచ్చింది. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు ఉప్పొంగుతోంది. దీంతో బుధవారం కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేశారు. తొలిరోజు 350 క్యూసెక్కుల చొప్పున నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. క్రమంగా పెంచుకుంటూ పోతామని హంద్రీ–నీవా ఎస్‌ఈ రాజగోపాల్‌ తెలిపారు. కర్నూలు జిల్లా పరిధిలో హంద్రీ–నీవా కింద కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్‌లు ఉన్నాయి. వాటికి కొంత నీటిని విడుదల చేస్తూనే అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 125 టీఎంసీలకు చేరుకుంది. 2.14 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి త్వరలోనే చేరుకునే అవకాశముంది.

తుంగభద్రకూ పోటెత్తుతున్న వరద

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయంకు కూడా వరద పోటెత్తుతోంది. బుధవారం ఉదయం లెక్కల ప్రకారం 1,00,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 59.718 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే నీటి విడుదలకు తుంగభద్ర బోర్డుకు అధికారులు ఇండెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులకు ఇండెంట్‌ ఇచ్చారు. త్వరలో దామాషా ప్రకారం కేటాయింపులు చేయనున్నారు. దీంతో పంటల సాగుపై స్పష్టత వచ్చే అవకాశముందని హెచ్చెల్సీ అధికారవర్గాలు వెల్లడించాయి.

తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు ఉప్పొంగుతున్న వరద

శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు ఎత్తిపోతల ప్రారంభం

వారంలోగా జీడిపల్లికి కృష్ణా జలాలు

త్వరలో తుంగభద్ర నీటి కేటాయింపులపై స్పష్టత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement