స్టోర్లకు నేటికీ చేరని బియ్యం | - | Sakshi
Sakshi News home page

స్టోర్లకు నేటికీ చేరని బియ్యం

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

అనంతపురం అర్బన్‌: ప్రతి నెలా ఒకటో తేదీన చౌక దుకాణాల్లో కార్డుదాలకు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. అయితే ఈ నెల జిల్లావ్యాప్తంగా దాదాపు 150 దుకాణాల్లో బియ్యం పంపిణీ ఐదో తేదీ దాటినా ప్రారంభం కాలేదు. అధికారిక నివేదిక ప్రకారం రేషన్‌ బియ్యం జిల్లావ్యాప్తంగా 15 శాతం స్టోర్లకు చేరలేదు. అత్యధికంగా అనంతపురం అర్బన్‌ పరిధిలో 60 నుంచి 70 స్టోర్లకు బియ్యం సరఫరా కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అయిన బియ్యానికి సంబంధించి సంచుల ట్యాగ్‌లు స్కానింగ్‌లోనూ... డీలర్‌ వద్ద ఉన్న యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రెండు రకాల బియ్యం వస్తాయి

జిల్లాకు రెండు రకాల బియ్యం వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 10 శాతం నూక ఉన్న బియ్యం సరఫరా అవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 15 శాతం నూక ఉన్న బియ్యం సరఫరా అవుతాయి. ఇక్కడ కేంద్రం సరఫరా చేస్తున్న బియ్యానికి సంబంధించి సంచులకు ఉన్న ట్యాగ్‌ను తప్పనిసరిగా స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఒకసారి, డీలర్‌కు సరఫరా అయిన తరువాత డీలర్‌ మరోసారి స్కాన్‌ చేయాలి.

మూడు రోజుల్లో సరఫరా చేస్తాం

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం సంచుల ట్యాగ్‌ను స్కానింగ్‌ చేసే విషయంలో డీలర్‌ వద్ద ఉన్న యాప్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ట్యాగ్‌ స్కానింగ్‌ కావడం లేదు. ఈ కారణంగా 15 శాతం స్టోర్లకు బియ్యం చేరలేదు. అధికంగా అనంతపురం అర్బన్‌లో 60 నుంచి 70 దుకాణాలు సరఫరా కాలేదు. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారమైతే మూడునాలుగు రోజుల్లో డీలర్లకు బియ్యం సరఫరా చేస్తాం.

– రమేష్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌,

పౌర సరఫరాల సంస్థ

దాదాపు 150 చోట్ల ప్రారంభం కాని పంపిణీ

సంచుల ట్యాగ్‌ స్కానింగ్‌తో వచ్చిన తంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement