ఊడిన రాళ్లు.. తుప్పుపట్టిన షట్టర్లు | - | Sakshi
Sakshi News home page

ఊడిన రాళ్లు.. తుప్పుపట్టిన షట్టర్లు

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

ఉరవకొండ: జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో తుంగభద్ర జలాలే కీలకం. డ్యాం నుంచి నీరు వచ్చే హైలెవెల్‌ కెనాల్‌ (హెచ్చెల్సీ) దుస్థితికి చేరుకుంది. కాలువ దెబ్బతిన్న చోట మరమ్మతుల ద్వారా పటిష్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయడానికి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కూడా శిథిలావస్థకు చేరిన కాలువ గట్ల మధ్య తుంగభద్ర జలాలు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. హెచ్చెల్సీ పొడవునా రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. కట్టడాలు, లైనింగ్‌ రాళ్లు ఊడిపోయి, షట్టర్లు తుప్పుపట్టి, కాలువ నిండా జంబు, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక చోట్ల కాలువ గట్లు కోతకు గురయ్యాయి. హెచ్చెల్సీ జిల్లా సరిహద్దు అయిన బొమ్మనహాళ్‌ 105వ కిలోమీటరు వద్ద నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.

మేల్కోకుంటే మూల్యం తప్పదు..

సాధారణంగా హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోయిన తరువాత కాలువ పొడవునా అవసరమైన మరమ్మతులు చేపట్టే వీలున్నా ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. నీటి విడుదలకు వారం ముందు హడావుడిగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని వల్ల నిధులు దుర్వినియోగం అవుతుండగా.. కాలువకు అనేక చోట్ల గండిపడి నీరు వృథా కావడం, జిల్లాకు రావాల్సిన నీటి వాటా పూర్తిస్థాయిలో దక్కకుండా పోవడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి జిల్లాకు హక్కుగా రావాల్సిన 42.50 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు.

నింబగల్లు వద్ద హెచ్చెల్సీ రెగ్యులేటర్‌ కట్టడం రాళ్లు ఊడిపోయి షట్టర్లు తుప్పు పట్టిన దృశ్యం, కాలువకు రెండువైపులా లైనింగ్‌ లేక వంకను తలపిస్తున్న హెచ్చెల్సీ

దుస్థితిలో హై లెవెల్‌ కెనాల్‌..

కాలువ గట్లు దెబ్బతిన్నా పట్టని వైనం

10వ తేదీ నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల

మరమ్మతులు చేయకుంటే నీరు సాఫీగా సాగడం కష్టమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement