● ఎంపీడీఓలను కోరిన జెడ్పీ సీఈఓ
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురంలోని 63 మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వెంటనే ప్రతిపాదనలను పంపాలని, వాటికి మాత్రమే ఆమోదం లభిస్తుందని జిల్లా పరిషత్ సీఈఓ పి.విజయలక్ష్మి అన్నారు. నగరంలోని జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ఎంపీడీఓల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో మంజూరై ఇంకా ప్రారంభం కాని, ప్రాధాన్యత లేని పనులను రద్దు చేసి, వాటి స్థానంలో పూర్తి నిధులను కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీడీఓలందరూ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశాల మేరకు కేవలం తాగునీటి పనులను మాత్రమే ప్రతిపాదించాన్నారు. ఒకవేళ ఎవరైనా గడిచిన మూడేళ్ల కాలంలో ప్రారంభం కాని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, భవనాల నిర్మాణం పనులను రద్దు చేయకపోతే మాత్రం ఎంపీడీఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, జెడ్పీ సాధారణ నిధుల వినియోగం, సాసా కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, జెడ్పీ ఏఓలు, ఉమ్మడి జిల్లా ఎంపీడీఓలు హజరయ్యారు.


