టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. కాలువలకు నీటి విడుదల ఆలస్యమైతే వరి నారు ముదిరి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో పాటు సాగు పనులన్నీ గందరగోళంగా మారే అవకాశం ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. కాలువలకు నీటి విడుదల ఆలస్యమైతే వరి నారు ముదిరి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో పాటు సాగు పనులన్నీ గందరగోళంగా మారే అవకాశం ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు.

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

బొమ్మనహాళ్‌: బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లోని చాలా గ్రామాల్లో వ్యవసాయ బోర్ల కింద ఇటీవల పెద్ద ఎత్తున వరి నారు పోశారు. ఈ నెల మొదటి వారంలో టీబీ డ్యాంకు వరద పెరగడంతో రైతులు ఆశతో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో నారు పెంచారు. సోనామసూరి, ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ రకాల నారు ఎక్కువగా పెంచుతున్నారు. కొందరు రైతులు ముందస్తుగానే ఒప్పందం చేసుకుని 30 నుంచి 40 రోజుల పాటు నారు పెంచి అందజేస్తుంటారు. నారును సెంటు లెక్కన రైతులకు విక్రయిస్తారు.ప్రస్తుతం సెంటు నారు రూ.1,300 నుంచి రూ. 1,500 లెక్కన పలుకుతోంది. ఏటా హెచ్చెల్సీ ఆయకట్టు కింద 30 వేల ఎకరాల్లో వరి పంట సాగవుతుండగా... ఆయకట్టు రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు ఇక్కడి నారు సరఫరా అవుతుంది.

నీరందేది ఎన్నడో...?

హెచ్చెల్సీ ఆయకట్టుకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదలయ్యే నీరే ఆధారం. జలాశయంలో ఈ సారి ఆశించిన మేర నీరు చేరకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం డ్యాంలో 25.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఐదు రోజుల క్రితం 48 వేల క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో బుధవారానికి 4,860 క్యూసెక్కులకు పడిపోవడం గమనార్హం. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, తీర్థనహళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయాలంటే డ్యాంలో కనీసం 80 టీఎంసీల నీరు నిల్వ ఉండాలని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఆ మేరకు నీరు చేరేదెన్నడు.. హెచ్చెల్సీకి విడుదల చేసేది ఎన్నడో తెలియడం లేదు.

వేయికళ్లతో ఎదురుచూపులు..

కాలువలకు సకాలంలో నీరు రాకపోతే పంట సాగు ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే వరి నారు ముదిరి నాట్లకు పనికిరాకుండా పోతుంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం రైతులు చేసిన ఖర్చంతా వృథా అవుతుంది. దీంతో వరి నారు పెంచుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించి, డ్యాం నిండాలని కోరుకుంటున్నారు. వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

80 టీఎంసీలకు చేరితేనే నీటి విడుదల

తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో డ్యాంకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. డ్యాంలో 80 టీఎంసీల నీరు చేరితేనే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. డ్యాంకు నీరు వచ్చేంతవరకు రైతులు ఎదురుచూడక తప్పదు.

– సుధాకర్‌రావు, హెచ్చెల్సీ ఎస్‌ఈ

బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో పెద్ద ఎత్తున వరినారు పెంపకం

తుంగభద్రకు ఇన్‌ఫ్లో తగ్గడంతో హెచ్చెల్సీకి నీటి విడుదలపై సందిగ్ధం

నారు పెంచుతున్న రైతులు

బెంబేలెత్తుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement