అనంతపురం అర్బన్: బిడ్డను బతికించుకునేందుకు ఆ కన్నపేగు పడుతున్న ఆరాటం అందరినీ కలచివేస్తోంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బిడ్డతో పాటు కలెక్టరేట్‌కు వచ్చి ప్రభుత్వ పరంగా సహాయం కోరారు. వివరాలు.. పెద్దవడుగూరు మండలం తగరకుంటపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, బిందుప్రియ దంపతులకు మూడు నెలల క్రితం పండంటి మగ బిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించాడనే సంతోషం ఆ తల్లిదండ్రులకు కొన్ని రోజుల్లోనే మాయమైంది. అరుదైన ఎస్‌ఎంఏ టైప్–1 అనే వ్యాధి సోకిందని తేలడంతో హతాశులయ్యారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్తే బాబుకు ఒక ఇంజక్షన్ ఇస్తే బతుకుతాడని, దాని ఖరీదు రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో ఆ దంపతులకు దిక్కుతోచలేదు. వస్తున్న వేతనం పూర్తిగా బాబు వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. బుధవారం కలెక్టరేట్‌కు వచ్చి సాయమందించాలని కలెక్టర్‌ను కోరారు. సమస్యను డీఎంహెచ్‌ఓకు కలెక్టర్ సిఫారసు చేశారని, సీఎంఆర్‌ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే కొంతమేర ఫలితం ఉంటుందని సూచించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. దాతలు స్పందించి సహాయం చేస్తే బిడ్డను బతికించుకుంటామని విజ్ఞప్తి చేశారు. మానవతామూర్తులు దయ చూపాలని పలువురు కోరారు.
R. Naveen Kumar Reddy
A/c 30830783425
SBIN0011125
RAYALACHERUVU


