● నేడు జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు జిల్లా పరిషత్‌లో బుధవారం ఎంపీడీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యను మంగళవారం ‘దాహం..దాహం’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మంది ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాల జాబితాను సిద్ధం చేసి ప్రత్యేక నివేదికలతో సమావేశానికి హాజరు కావాలన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశాలకు
తుది అవకాశం
అనంతపురం: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి 19వ తేదీలోపు తుది అవకాశం కల్పిస్తున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఈ నెల 18లోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఆప్షన్స్ నమోదు, 21న ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. 24న అలాట్‌మెంట్స్ ప్రకటిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 68055 10654లో సంప్రదించవచ్చన్నారు.
సీనియారిటీ జాబితా
సిద్ధం చేయండి: డీఆర్‌ఓ
అనంతపురం అర్బన్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కేడర్ల వారీగా సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని డీఆర్‌ఓ ఎ.మలోల సంబంధిత శాఖల అధిపతులను ఆదేశించారు. డీఆర్‌ఓ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి అమలు కమిటీ (డీఎల్‌ఐసీ) సమావేశం నిర్వహించారు. కేడర్ల వారీగా ముసాయిదా సీనియారిటీ జాబితా, పోస్టులు, వివరాల పరిశీలన తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. సమావేశంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, పశు సంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకోఠారి, హౌసింగ్ పీడీ శైలజ, డీసీఓ అరుణకుమారి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


