● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో వృద్ధునిపై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు చేసిన అవమానంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడు మోకా ఆంజనేయులును బుధవారం ‘అనంత’ పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న ఆంజనేయులును అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మారుతిప్రసాద్, అతని భార్య, మాజీ సర్పంచు లావణ్యలు చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్నడంతో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగిన విషయం విదితమే. బాధిత కుటుంబ సభ్యులు ఆయనను అనంతపురం జీజీహెచ్‌కు తరలించి వైద్య చికిత్సలందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత కణేకల్లు మండల వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి బాధితుడిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో ‘అనంత’ మాట్లాడారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా కొట్టి అవమానపరచడం హేయమన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పాటిల్ బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమన, నాయకులు గోపాల్, లాలుస్వామి తదితరులు పాల్గొన్నారు.


