అనంతపురం టౌన్: టీడీపీలో అంతర్గత పోరు రగులుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకు మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడిపై ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని, జిల్లా అధ్యక్షుని ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం అర్బన్‌లో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇటీవల పలువురి పేర్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు సిఫార్సు చేశారు. నియోజకవర్గంలోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ముఖ్య అనుచరులను సైతం వెంటనే సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాత్రం దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న వారిని వెనకేసుకురావడంతోపాటు పార్టీ కార్యాలయంలో పక్కనే పెట్టుకొని ప్రెస్‌మీట్లు నిర్వహించడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి రగిలిపోయినట్లు తెలిసింది. స్వయంగా తానే సిఫార్సు చేసినా పెడచెవిన పెట్టడంతో పాటు తనపై విమర్శలు చేస్తున్న వారిని పూల నాగరాజు పక్కన పెట్టుకుని తిరుగుతుండడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులు బహిరంగంగానే పూల నాగరాజుపై తీవ్ర విమర్శలకు దిగడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలాగే కొనసాగితే పార్టీ కార్యాలయంలోకి సైతం అడుగు పెట్టనివ్వబోమంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ హెచ్చరించడం సంచలనంగా మారింది.
బీసీ నేతల ఆగ్రహం..
పూల నాగరాజు బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అదే పనిగా రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీకే చెందిన బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే అర్బన్ ఎమ్మెల్యేకు రుచించడం లేదని, అందుకే మైనార్టీ నేతతో మీడియా సమావేశాలు పెట్టి తిట్టిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎమ్మెల్యే సిఫార్సులతో సస్పెండ్ చేసుకుంటూ పోతే అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు సైతం ఎవరూ మిగలరని ఆ పార్టీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నిరంకుశత్వంపై అంతా ఏకమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడిపై
అర్బన్ ఎమ్మెల్యే గుర్రు
పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టనివ్వబోమంటూ ఎమ్మెల్యే వర్గం
బహిరంగంగానే హెచ్చరికలు
దగ్గుపాటి వర్గీయుల తీరుపై
టీడీపీ బీసీ నేతల మండిపాటు


