● సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలి
● ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో కదం తొక్కిన ఉద్యోగులు
అనంతపురం కల్చరల్: ఉద్యోగులను వంచిస్తే ఉద్యమాలు తప్పవని వక్తలు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. ఏపీసీపీఎస్‌ఈఏ (రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం) ఆధ్వర్యంలో శనివారం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టవర్‌క్లాక్ కూడలిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. లలితకళాపరిషత్తులో ‘ఉద్యోగుల మహా సంగ్రామం’ పేరిట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ బాజీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు న్యాయం చేస్తామని చెప్పి వంచించారన్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ ప్రధాన కార్యదర్శి గరివి రాజేశ్వరరావు, సహాధ్యక్షుడు కిరణ్ అగర, ప్రధాన కార్యదర్శి జనార్దనరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రమేష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి రవికుమార్, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు హరి మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


