కాలువలో నీరు పారుతున్నా ఆయకట్టుకు మాత్రం చుక్క కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వరినాట్లు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న రైతులు సాగుకు నీరెప్పుడు వదులుతారా అని కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 95 టీఎంసీల నీరు ఉన్నాయి. మరో 5 రోజుల్లో డ్యాం నిండి క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పరిస్థితి బాగానే ఉన్నా సాగు నీరివ్వకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కణేకల్లు: హెచ్‌ఎల్‌ఎంసీ (హైలెవల్ మెయిన్ కెనాల్) పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్, డీ.హీరేహాళ్, విడపనకల్లు మండలాల్లో 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 29 వేల ఎకరాలు తరి భూమి కాగా, మరో 9 వేల ఎకరాలు ఆరుతరి. ఏటా టీడీ డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేసిన నాలుగైదు రోజుల్లో ఆయకట్టుకు నీరిచ్చేవారు. ఈ సారి నీరు విడుదలై 10 రోజులవుతున్నా ఆయకట్టుకు వదలకపోవడం గమనార్హం.
ముదిరిపోతున్న వరినారు
హెచ్చెల్సీ ఆయకట్టు భూముల్లో వరి సాగు కోసం రైతులు వరినారు పోసుకున్నారు. 43 ఉడేగోళం, బ్రహ్మసముద్రం, యర్రగుంట, ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట, గోనేహళ్, బొమ్మనహళ్, లింగదాళ్, దేవగిరిక్రాస్, బెణికల్లు, మారెంపల్లి తదితర గ్రామాల్లో రైతులు వరినారు పోసి 30 రోజులవుతోంది. 40 రోజుల్లోపు ఈ నారు తీసి పొలాల్లో నాటాలి. ఆలస్యం చేస్తే నారు ముదిరి పనికి రాకుండా పోవడం, అలాగే నాటితే దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే సాగునీటి విడుదలపై ప్రతిష్టంభన నెలకొనడంతో రైతుల్లో రోజురోజుకూ ఆందోళన ఎక్కువవుతోంది.
అప్పులు చేసి..
ఆయకట్టుకు నీరిస్తారనే ఆశతో పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసి వరినారు పోశారు. ఎకరా విస్తీర్ణంలో నారు సాగుకు విత్తనాలు, పురుగు ముందులు, కూలీలకు కలిపి రూ. 20 వేల వరకు ఖర్చు పెట్టారు. సాగునీటి విడుదలపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరివ్వకుంటే భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
వరి నాట్లకు సర్వం
సిద్ధం చేసుకున్న రైతులు
సాగు నీటి కోసం
తప్పని ఎదురుచూపులు
నారు ముదిరిపోతోందని దిగాలు
సర్కారు నిర్లక్ష్య తీరుపై 22న వైఎస్సార్‌సీపీ ధర్నా
22న వైఎస్సార్‌సీపీ ధర్నా
వరినాట్లకు సమయం మించిపోతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన నెలకొన్నా చంద్రబాబు సర్కారు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆయకట్టుకు సాగునీటి విడుదల విషయంలో సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న రైతులతో కలిసి గోనేహళ్ క్రాస్ సమీపంలో హెచ్చెల్సీ వద్ద వైఎస్సార్ సీపీ భారీ ధర్నా తలపెట్టింది.


