అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఓబులదేవనగర్‌కు చెందిన చంద్రమోహనాచారి, నారాయణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. టైలరింగ్ పనితో చంద్రమోహనాచారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి పనులకు వెళుతూ నారాయణమ్మ చేదోడుగా నిలిచారు. వీరి కుమార్తె ఉమాదేవి పుట్టుకతోనే మెదడు (ఎడమ వైపు) ఎదుగుదల లేక ఇబ్బంది పడుతోంది. ఐదేళ్ల వయస్సు వచ్చినా సరిగా నడవలేక ఇతరులపై ఆధారపడుతుండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపించారు. అప్పటి నుంచి చికిత్స చేయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉమాదేవికి పాతికేళ్లు. నేటికీ మంచానికే పరిమితమైంది.
అందని రూ.15 వేల పింఛన్
కదల్లేని స్థితిలో ఉన్న వారికి ప్రభుత్వం రూ. 15 వేలు సామాజిక భద్రత పింఛన్ ఇస్తోంది. అయితే వంద శాతం బుద్ధిమాంద్యంతో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉన్నట్లుగా సదరం సర్టిఫికెట్ కలిగిన ఉమాదేవికి మాత్రం రూ.6 వేలు మాత్రమే వస్తోంది. ఇదే విషయాన్ని గతంలో ఓబులదేవనగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దృష్టికి ఉమాదేవి తల్లి నారాయణమ్మ తీసుకెళ్లింది. పరిస్థితి మొత్తం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే రూ.15 వేలు పింఛన్ అందజేసేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. అయితే నేటికీ ఇది కార్యాచరణలోకి రాకపోవడంతో చివరకు పాపకు మందులు కొనుగోలు చేయడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో చంద్రమోహనాచారి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మసీదులు, చర్చిల వద్ద జోలె పట్టి భిక్షమెత్తి కుమార్తెకు అవసరమైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
సాయం చేయదలిస్తే..
కదిలిస్తే.. కన్నీళ్లే
చేతిలో చిల్లిగవ్వ లేక
కనీస చికిత్సకూ దూరం
శస్త్రచికిత్సతో నయమవుతుందన్న
వైద్య నిపుణులు
ఆపన్న హస్తం కోసం
ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం
వెంటాడుతున్న పేదరికం
చంద్రమోహన్, నారాయణమ్మ దంపతుల కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంటి అద్దె రూ.8 వేలు, కుమార్తె మందుల ఖర్చు నెలకు రూ.3 వేలకు పైగా ఉంటోంది. అప్పులు చేసి కుమార్తె చికిత్స కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వీటికి వడ్డీలు చెల్లించే క్రమంలో ఇంట్లో ఉన్న సామగ్రి, బంగారు నగలు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంట్లో ఓ మూలన ఉంచిన పాతిక కిలోల రేషన్ బియ్యం ఆ కుటుంబం పేదరికాన్ని వెక్కిరిస్తోంది. ఇలాంటి దుర్భర పేదరికంలో మగ్గిపోతున్న వారికి కుమార్తె శస్త్రచికిత్స ఖర్చులు తలకు మించిన భారమైంది. దీంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా స్పందించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
చదువుల తల్లి
ఉమాదేవికి చదువంటే చాలా ఇష్టం. ఈ విషయం గుర్తించిన తల్లి దగ్గరుండి ప్రతిరోజూ కుమార్తెను ఎత్తుకుని సమీపంలోని శ్రీకృష్ణదేరాయ పాఠశాలకు తీసుకెళ్లేది. ఇలా పదో తరగతి వరకూ అదే పాఠశాలలో చదువుకుంటూ స్కూల్ టాపర్‌గా నిలిచింది. అనంతరం ఐటీఐలో కంప్యూటర్స్ కోర్సు అభ్యసించి, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. మూడో ఏడాదికి సంబంధించి పరీక్షలు రాస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యంతో పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమని పేర్కొన్నారు. ఇందుకు రూ.30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని తెలిపారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.
ఒకట్రెండు సంవత్సరాలు కాదు.. పాతికేళ్లుగా కన్నకుమార్తె భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటం సాగిస్తున్న ఆ కుటుంబం జీవన ప్రయాణం వింటే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు. ఎన్నో అవమానాలు, అన్యాయాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో కుమార్తెను మామూలు మనిషిని చేసుకునేందుకు పడే తపనలో సర్వమూ కోల్పోయారు. అదే సమయంలో ఖరీదైన శస్త్రచికిత్స ఒక్కటే తమ బిడ్డను బతికిస్తుందన్న వైద్యుల మాట వారిలో ఆశలు చిగురింపజేశాయి. అయితే చేతిలో చిల్లిగవ్వ లేని ఆ కుటుంబం.. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.


