యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Aug 20 2026 7:44 AM | Updated on Aug 20 2026 7:44 AM

రాప్తాడు రూరల్‌: వివాహం నిశ్చయమైన యువతితో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం రూరల్‌ మండలంలోని బళ్లారి రోడ్డు సీఆర్‌ఐటీ కళాశాల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. అనంతపురం రాంనగర్‌కు చెందిన ప్రదీప్‌కుమార్‌కు ఇటీవల నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. యువతి నడవడికపై ప్రదీప్‌కుమార్‌కు అనుమానం రావడంతో ఆమెను మందలించినట్లు, ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు స్టేషన్‌కు రావాలని ప్రదీప్‌కుమార్‌ కుటుంబ సభ్యులను కోరినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన ప్రదీప్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చనిపోతానని చెప్పి వెళ్లడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె ఫిర్యాదు మేరకు నాల్గో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ప్రదీప్‌కుమార్‌ బళ్లారి రోడ్డులోని సీఆర్‌ఐటీ కళాశాల సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనంలో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అనంతపురం రూరల్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

అవినీతిని పెంచి పోషిస్తున్న చంద్రబాబు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌

అనంతపురం అర్బన్‌: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. లంచం ఇవ్వనిదే ఏ పని జరగని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఓటుకు నోటు గురించి నీతులు మాట్లాడుతున్న చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యే సీటును రూ.30 కోట్లకు ఎందుకు అమ్ముకున్నారో చెప్పాలని నిలదీశారు. సీట్లు అమ్ముకున్న చంద్రబాబు ఇప్పుడు ఓటుకు డబ్బులు తీసుకోవద్దనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్‌ కేవలం 100 రోజుల్లో అవినీతిని అంతమొందించారన్నారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు అవినీతిని అంతమొందించకపోగా పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, నాయకులు రమేష్‌, నారాయణస్వామి, పద్మావతి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యాయత్నం

గార్లదిన్నె: మండల పరిధిలోని సంజీవపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఆదినారాయణ, శివయ్యకు పొలం వద్ద రస్తా వివాదం నడుస్తోంది. ఈ సమస్యపై కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలోనే బుధవారం పొలంలో రస్తా కొలతలు తీయడానికి తహసీల్దార్‌ ఈరమ్మ, ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన రైతు శివయ్య పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement