తమ్ముడిపై అన్న కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

తమ్ముడిపై అన్న కత్తితో దాడి

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

గుంతకల్లు రూరల్‌: తోడబుట్టిన తమ్ముడిపైనే ఓ అన్న కత్తితో దాడి చేసిన ఘటన గుంతకల్లు మండలం కసాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కసాపురానికి చెందిన బాబూప్రసాద్‌, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెళ్లిళ్లు కావడంతో అదే గ్రామంలో ఎవరికి వారు వేరు కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు రూ.లక్ష ఇవ్వాలంటూ రెండు రోజులుగా తల్లిపై పెద్ద కుమారుడు చైతన్య తీవ్ర ఒత్తిడి చేస్తూ వచ్చాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు శ్రావణ్‌కుమార్‌ మంగళవారం రాత్రి తన అన్నను కలసి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గొడవ చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ అంశంపై కక్ష పెంచుకున్న చైతన్య... బుధవారం ఉదయం తన ముందు వెళుతున్న శ్రావణ్‌కుమార్‌పై వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. అయితే పరిస్థితి విషమిస్తుండంతో కర్నూలుకు తీసుకెళ్లారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి తెలిపారు.

చిరుత దాడిలో గొర్రెల మృతి

శెట్టూరు: మండలంలోని రంగయ్యపాళ్యంలో చిరుత దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు నందన్న తెలిపిన మేరకు... మంగళవారం తెల్లవారు జామున గ్రామ శివారున ఉన్న గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో 10 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత సంచార ఆనవాళ్లను గుర్తించారు. ప్రత్యక్షంగా ఎవరూ చూడకపోయినా గొర్రెల మందపై దాడి చేసింది చిరుతేనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అదే రోజు రాత్రి రంగయ్యపాళ్యం, తిప్పనపల్లి, కనుకూరు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

దాడులను తిప్పికొడదాం

వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు

అనంతపురం కల్చరల్‌: క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా తిప్పి కొడదామంటూ వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు పిలుపునిచ్చారు. ఏఐసీసీ (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆ సంఘం కార్యాలయంలో క్రైస్తవ సంఘాల సమావేశం జరిగింది. రెవరెండ్‌ ఏఐసీసీ విజయకుమారి , వైపీ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ ప్రార్థనామందిరాల నుంచి సంఘ కాపరులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు హాజరై మాట్లాడారు. ఏఐసీసీతో కలిసి కమిటీగా ఏర్పడి వచ్చే నెల 6న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రెవరెండ్‌ గేరహాను విశిష్ట అతిథిగా విచ్చేస్తారని సభను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమైక్యంగా ఉంటూ బలాన్ని చాటుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో పాస్టర్లు యేషయా, నెహమ్యా నాగరాజు, అనిల్‌ మోజెస్‌, మనేషా, మార్క్‌, జహంగీర్‌, కమల్‌, విల్సన్‌, కరుణాకర్‌, చార్లెస్‌ నాయక్‌, చల్లా కిషోర్‌, జానీ, జాకోబు, అబ్రహాం, సాల్మన్‌రాజ్‌, ప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement