రాయలసీమ అభివృద్ధికి కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి. సీమ ప్రజల ప్రయోజనాల కోసం పోరుబాటను మరింత ఉధృతం చేస్తాం. హంద్రీ–నీవా పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయడం మినహా చేసిందేమీ లేదు. హంద్రీ–నీవా ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా అందించడం లేదు. డిస్ట్రిబ్యూటరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో హంద్రీ–నీవాను 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు కూడా 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు కుదించి నిధులు దోపిడీ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో దూరదృష్టితో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 788 అడుగుల నుంచే నీరు తోడే కార్యక్రమం అమలు చేస్తోంది. పాలమూరు, దిండి ప్రాజెక్ట్‌లకు, విద్యుదుత్పత్తికి రోజూ 8 టీఎంసీల నీరు తోడుకుంటోంది. రాయలసీమ ప్రయోజనాల నిమిత్తం పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు తరలించేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ అమలు చేశారు. ఈ ప్రాజెక్టు ఇన్సూరెన్స్ లాంటి పథకం. అలాంటి ప్రయోజనం రాయలసీమకు కలగకుండా ఇప్పుడు చంద్రబాబు నిలుపుదల చేయించడం పుట్టిన గడ్డకు దగా చేయడమే. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపిందని సాకుగా చూపి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపేశారు. సీమ అభివృద్ధి కోసం గతంలో బీజేపీ ప్రకటించిన ‘రాయలసీమ డిక్లరేషన్’ను వెంటనే అమలు చేయాలి.
– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంతపురం: కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత అవశ్యమని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. అలాంటి కీలకమైన సాగు–తాగునీటి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని గండికొట్టడంపై మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపివేతతో ‘సీమ’ ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్ట్‌లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పూర్తి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామన్నారు.
● ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లు – సమాలోచన’ అనే అంశంపై శుక్రవారం అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌నాథ్‌రెడ్డి, కేవీ రమణ తదితరులు మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలని, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తితో పాటు పలు అంశాలపై తీర్మానం చేశారు.
‘అనంత’ నుంచే ఉద్యమ కార్యాచరణ
రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన నికర జలాలు, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిచేయాలనే ప్రధాన డిమాండ్‌తో అనంతపురం నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. శ్రీకాకుళంలో పడే వర్షం నీరు.. అనంతపురానికి ఎలా చేరుస్తారో.. మేఘాలను పిండి నీరు పారేలా చేస్తారా.. లేక డ్రోన్లతో నీరు పంపుతారా.? పట్టిసీమ ఒట్టి సీమేనని ఆనాడే చెప్పాం. పట్టిసీమతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. అమరావతి రియల్ ఎస్టేట్‌కు అప్పులు చేస్తే.. రాయలసీమ వాసులు ఎందుకు పన్నులు చెల్లించాలి? అమరావతి ఫ్రీ జోన్ అని ఎందుకు ప్రకటించలేదు. కేవలం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమలోని అన్ని ప్రాజెక్ట్‌లూ పూర్తవుతాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా బాగు పడాలంటే కేవలం కృష్ణా జలాల మీదే ఆధారపడి ఉంది. హెచ్చెల్సీకి నికరంగా రావాల్సిన నీరు గతంలో ఎన్నడూ రాలేదు. కృష్ణా జలాల సాధనపైనే పోరాటం చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
– సాకే శైలజానాథ్, మాజీ మంత్రి,
గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ చైర్మన్
ప్రభుత్వంలో చలనమేదీ?
కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం తెలంగాణపై కేంద్రం ఒత్తిడి చేస్తున్నా, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు కోసం టెండర్లు పిలిచినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు. సీమకు ఇన్సూరెన్స్ లాంటి పథకం అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చంద్రబాబు తాకట్టు పెట్టేశారు. ఇది చాలా అన్యాయం.
– బోయ గిరిజమ్మ,
ఉమ్మడి అనంతపురం జెడ్పీ చైర్‌పర్సన్
సీమ రైతుకు మరణశాసనం
ఎత్తిపోతల పథకం ఆపివేత రాయలసీమ రైతుకు మరణశాసనం. సీమకు నీటి వసతి కల్పనపై ఆలోచించకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. సాగునీరు లేక, పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేంత వరకు ఉద్యమం కొనసాగించాలి.
– నరేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు
సిగ్గులేని మంత్రి పయ్యావుల కేశవ్
శ్రీకాకుళంలో వర్షం కురిస్తే అక్కడి నుంచి అనంతపురం నీరు తరలిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుదల చేసి కృష్ణా జలాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. మరో వైపు అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చి భైరవాని తిప్ప ప్రాజెక్ట్‌కు, తుంగభద్ర నది నీరు రాకుండా కుట్ర జరుగుతోంది. పోలవరం ఎత్తు తగ్గించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకాన్ని ఆపించానని బహిరంగంగా ప్రకటించారు. మన ఆత్మగౌరవంపై దెబ్బతీస్తున్నా.. కనీసం చంద్రబాబు స్పందించలేదు. మంత్రి పయ్యావుల కేశవ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా రూ.1,600 కోట్లు ఖర్చు పెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కనిపించడం లేదు.. అదో ‘థెఫ్ట్ ప్రాజెక్ట్’ అని చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ జన్మభూమికి ద్రోహం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.
– వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. సీమకు తీరని ద్రోహం
రాయలసీమ ఎత్తిపోతల పాజెక్టు పూర్తి చేస్తేనే ఉమ్మడి అనంతకు సాగు–తాగునీరు
రూ.10వేల కోట్ల ఖర్చుతో పెండింగ్ నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు
హంద్రీనీవా కాలువ వెడల్పు, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తికి తీర్మానం
జల సాధన పోరుబాటకు సిద్ధం కావాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలోవైఎస్సార్‌సీపీ నేతల పిలుపు


