● ఈ నెల 20 దాకా దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి.శైలజ తెలిపారు. శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి శుక్రవారం నాటికి గడువు ముగిసిందని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఎస్పీడీ ఆదేశాలతో గడువు పొడిగించామని వెల్లడించారు కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 32 కేజీబీవీల్లో అన్ని తరగతులకూ కలిపి 2,779 సీట్లు ఉండగా, శుక్రవారం నాటికి 7,501 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కేజీబీవీల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని బాలికల నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేయని అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద కుటుంబాలకు చెందిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. https://apkgbv. apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందజేస్తామని, సంబంధిత కేజీబీవీల్లోని నోటీసు బోర్డుల్లో కూడా వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే 79933 29115, 70750 39990 నంబర్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని దినాల్లో సంప్రదించాలని ఏపీసీ కోరారు.


