రీ–సర్వే నాల్గో విడతలో 90 గ్రామాలు
అనంతపురం అర్బన్: భూముల రీ–సర్వే నాల్గో విడత 90 గ్రామాల్లో చేపట్టామని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను సోమవారం వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో 79 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. నాల్గో విడత కింద 90 గ్రామాల పరిధిలో 9,710.07 ఎకరాలను రీ–సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు.
చెరువులు నింపకపోతే ఆత్మహత్యలే
● పుట్లూరు మండల రైతుల ఆవేదన
అనంతపురం సెంట్రల్: వేసవికి ముందే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, చెరువులు నింపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పుట్లూరు మండల రైతులు స్పష్టం చేశారు. నీటి కోసం వారు సోమవారం హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ హెచ్చెల్సీ కింద చివరన ఉన్న సుబ్బరాయసాగర్, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి తదితర చెరువులున్నాయని, వీటికి నీరివ్వడంలో ఏటా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా చెరువులకు నీరివ్వలేదని తెలిపారు. తుంపెర డీప్ కట్ వద్ద కాలువ బంద్ చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నామని, వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండబోతోందని వివరించారు. వెంటనే చెరువులను నింపకపోతే ఈ ప్రాంత రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకోకతప్పదని హెచ్చరించారు. తాగునీటికోసం గ్రామాల్లో నిత్యం గొడవులు జరుగుతున్నాయని పలువురు మహిళలు ఆవేధన వ్యక్తం చేశారు.
డిస్ట్రిబ్యూటరీలు మూసేస్తే
పంటలు ఎండుతాయ్
చివరి ప్రాంతానికి నీటిని తీసుకుపోవాలని డిస్ట్రిబ్యూటరీలను మూసేస్తే పంటలన్నీ ఎండిపోతాయని బుక్కరాయసముద్రం మండలం జంతులూరు, నీలంపల్లి గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్ కెనాల్ కింద ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ దశలో డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు బంద్ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. నాలుగైదు తడులు అందిస్తే పంటలు చేతికొస్తాయని, క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
పరిష్కారం చూపండి సారూ!
అనంతపురం అర్బన్: అర్జీలు ఇవ్వడమే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదంటూ పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ మళ్లీ అర్జీలు పట్టుకుని రావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతి వారం అర్జీల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 282 వచ్చాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
నా ఇల్లు నాకు ఇవ్వండి
● అనంతపురంలోని కోవూరునగర్‌లో ఉంటున్న ఇ.రఘుకు 2018లో టిడ్కో ఇల్లు మంజూరైంది. తనవంతు వాటాగా డబ్బు డిపాజిట్ చెల్లించాడు. అయితే ఈయనకు మంజూరైన ఇల్లు మరొకరికి కేటాయించారు. తనకు మంజూరైన ఇంటిని తనకే ఇవ్వాలంటూ ఏడేళ్లుగా అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. గత నెల 27న నగరపాలక సంస్థ ఎండార్స్‌మెంట్ ఇస్తూ ‘మీరు పీఎంఏవై కింద కట్టిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఇస్తాం’ అని పేర్కొన్నారు. తనకు డబ్బులు తిరిగివ్వడం కాదు.. మంజూరైన ఇంటిని అప్పగించాలని రఘు సోమవారం మరోమారు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీ సమర్పించాడు.
రీ–సర్వే నాల్గో విడతలో 90 గ్రామాలు


